డిఎస్ పై వేటు.. ఎందుకబ్బా లేటు ??
టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ పై వేటు విషయంలో సీఎం కేసీఆర్ మీమాంసలో పడ్డారా? కవితకు, డీఎస్‌కు పొసగకపోవడాని కారణాలేంటి? కేసీఆర్ కుటుంబం నుంచి మరో రాజకీయ నాయకుడు రాబోతున్నాడా? ఆయన కోసమే ఈ తతంగం అంతా నడుస్తుందా? ఇంతకీ కేసిఆర్ ఫ్యామిలీ నుంచి రాజకీయాల్లోకి రాబోతున్న ఆయనెవరు? డీఎస్ విషయంలో కేసీఆర్ ఎందుకు వెనుక ముందు అయితున్నారో తెలుసుకోవాలంలోటే ఈ స్టోరీ చదవాల్సిందే.
డి.శ్రీనివాస్ కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరించిన నాయకుడు. సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ ఎస్ లో చేరి రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. నిజామాబాద్ జిల్లా రాజకీయాల మీద వ్యక్తి. అయితే గత కొంత కాలంగా నిజామాబాద్ ఎంపీ కవిత, డీఎస్ ల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. దీంతో నిజామాబాద్ రాజకీయాలు వేడేక్కాయి. అవి ఎంతలా అంటే చివరకు డీఎస్ ను సస్పెండ్ చేసేంత వరకు వెళ్లాయి. డిఎస్ చిన్న కుమారుడు అర్వింద్ బీజేపీలో చేరినప్పటి నుంచి కవితపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. తన కొడుకును కంట్రోల్ చేయాలని డీఎస్ కు కవిత అనేక సార్లు చెప్పినా అరవింద్ ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు. దీంతో కవిత డీఎస్ పై గుర్రుగా ఉంటున్నారు. డీఎస్ కావాలనే విమర్శనాస్త్రాలు చేయిస్తున్నారన్న చర్చ కూడా ఉంది. తన కుమారుల భవిష్యత్ కోసం నిజామాబాద్ టిఆర్ఎస్ సీటుకు ఎసరు తెస్తారేమోనన్న భయం కవితకు పట్టుకుంది. నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్ నుంచి తన కొడుకులను బరిలోకి దింపే విధంగా డీఎస్ కసరత్తు చేస్తున్నారనే వినికిడి ఉంది. దీంతో ఎలాగైనా డీఎస్ కు చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నారు కవిత.
ఈ పరిస్థితుల్లోనే.. ఇప్పటి వరకు తెర వెనుక ఉన్న కవిత భర్త అనిల్ రావు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనల్లో ఉన్నట్టు తెలుస్తున్నది. కవిత జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. నిజామాబాద్ ఎంపీ స్థానాన్ని భర్త అనిల్ రావుకు కేటాయించే దిశగా ఆమె పావులు కదుపుతున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు డీఎస్ కుమారుల కోసం పావులు కదుపుతున్నారు. దీన్ని గమనించిన కవిత ఆయనకు చెక్ పెట్టే దిశగా అడుగులు వేశారు. నిజామాబాద్ జిల్లా ఇంఛార్జ్ గా ఉన్న కరీంనగర్ జడ్పీ చైర్మన్ తుల ఉమను అప్పటికప్పుడు పిలిచి జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి డీఎస్ సస్పెన్షన్ కోసం సిఫారసు పంపారు. అది ఇప్పుడు సీఎం కేసీఆర్ వద్ద పెండింగ్ లో ఉంది.
సీఎం కేసీఆర్ నిర్ణయాలు తీసుకోవడంలో అపర చాణిక్యుడు. ఎంతటి నాయకుడైనా చిటికెలో పదవి నుంచి తొలగించే నైజం ఉన్న నాయకుడు. గతంలో దివంగత నేత టైగర్ ఆలె నరేంద్ర పై కేసీఆర్ ఏ మాత్రం ఆలోచించకుండా వేటు వేశారు. హీరోయిన్, టీఆర్ ఎస్ లో క్రీయాశీలకంగా వ్యవహరించిన విజయశాంతి పైనా కేసీఆర్ క్షణాల్లో వేటు వేశారు. అంతెందుకు టిఆర్ఎస్ సర్కారు వచ్చిన తర్వాతకూడా డిప్యూటి సీఎంగా ఉన్న రాజయ్యను చిటికెలో మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసేశారు. అంతటి ముక్కుసూటితనంతో వ్యవహరించే కేసీఆర్ డీఎస్ విషయంలో ఎందుకు వెనుకంజ వేస్తున్నారన్న చర్చ ఉంది. డిస్ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో డీఎస్‌కు కేసీఆర్ చాలా ప్రాధాన్యతనిచ్చేవారు. రాజకీయాలకు అతీతంగా వారి మధ్య చాలా మంచి అనుబంధమే ఉండేది. డీఎస్ ను సస్పెండ్ చేస్తే బీసీ నేతను వెళ్లగొట్టారనే అపవాదుతో పాటు పార్టీలోని లుకలుకలు బయటపడతాయనే భయంలో కేసీఆర్ ఉన్నట్లు టాక్ నడుస్తోంది. అందుకే డీఎస్ కు అపాయింట్ మెంట్ ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టారని డీఎస్ సన్నిహితులు అంటున్నారు. డీఎస్ కు చెక్ పెడితే అడగకుండానే భర్తకు సీటు ఇప్పించి తను మంత్రి పదవి పొందవచ్చనే ఆలోచనలో కవిత ఉన్నారు. మొత్తానికి కవిత , డీఎస్ ల వ్యవహారం సీఎం కేసీఆర్ కు తలనొప్పిగా మారింది. డీఎస్ ను ఉండమంటే కవితకు కోపం, కవిత చెప్పినట్టు వింటే ఆత్మీయుడు దూరమవుతాడు. దీంతో కేసీఆర్ పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుకలా తయారయ్యిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి ఈ పరిణామాలు ఎంత వరకు దారితీస్తాయో వేచి చూడాలి.