తెలంగాణ సిఎం కేసిఆర్ పక్కా పొలిటీషియన్. ఏదైనా వివాదంలో తనకు, తన పార్టీకి మేలు జరిగేదైతేనే ఆయన జోక్యం చేసుకుంటారు. తమకేమీ వర్కవుట్ కాదనుకుంటే అవతివాళ్లు కొట్టుకుని ఏట్లె పడ్డా పట్టించుకోరు. అటువంటిదే ఇప్పుడు తెలంగాణలో ఒక ఘటన జరిగింది. పూర్తి వివరాలు చదవండి.
గత కొంతకాలంగా హైదరాబాద్ కేంద్రంగా కత్తి మహేష్ అనే సినీ రంగానికి చెందిన వ్యక్తి మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నారు. ఆయన చర్చల్లో ఆకాశమే హద్దుగా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా రాముడు ఒక దగుల్బాజి అని తీవ్రమైన తిట్లు తిట్టాడు. అంతేకాదు సీత లంకలో ఉంటే బాగుండేది అని కూడా కామెంట్ చేశారు. రాముడి వద్దకు వచ్చింది కాబట్టే సీతకు కష్టాలొచ్చాయని కూడా అన్నారు. ఈ వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపాయి. కత్తి మహేష్ ను అరెస్టు చేయాలని పెద్ద ఎత్తున హిందూ ధార్మిక సంఘాలు, సంస్థలు ఆందోళనకు దిగాయి. ఈ ఆందోళనలో స్వామీ పరిపూర్ణానంద అగ్రభాగాన ఉన్నారు. పరిపూర్ణానంద సైతం కత్తి మహేష్ మాటలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం తాను పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వరకు పాదయాత్ర చేస్తానని ప్రకటించారు.
అయితే వీరిద్దరినీ తెలంగాణ పోలీసులు హైదరాబాద్ నగర బహిష్కరణ చేశారు. ముందుగా కత్తి మహేష్ మీద నగర బహిష్కరణ వేటు పడింది. తర్వాత కొద్దిగా ఆలస్యంగా స్వామి పరిపూర్ణానంద మీద కూడా ఆరు నెలలపాటు నగర బహిష్కరణ వేటు వేశారు పోలీసులు. ఇద్దరినీ బలవంతంగా వ్యాన్ లో ఎత్తుకుపోయి తెలంగాణ బార్డర్ అవతల పడేశారు. తెలంగాణ సిఎం కేసిఆర్ ఆదేశాల మేరకే వీరిద్దరికీ నగర బహిష్కరణ వేటు పడిందన్నది జగమెరిగిన సత్యమే. అయితే ఈ కేసులో మొదట కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అందుకే అతని మీద నగర బహిష్కరణ వేటు వేసింది. సర్కారు నిర్ణయాన్ని హిందూ సంస్థలు స్వాగతించాయి. కానీ దళిత సంఘాలు వ్యతిరేకించాయి. ఇది దళితులను వెలి వేయడమే అని సోషల్ మీడియాలో, బయటా క్యాంపెయిన్ స్టార్ట్ అయింది. కత్తి మహేష్ దళితుడు కాబట్టే ఆయనను వెలి వేశారంటూ ఒక ప్రచారం మొదలైంది. దీనికితోడు తెలంగాణ డిజిపికి 30 మంది ప్రజాస్వామికవాదులు,దళిత మేధావులు ఉత్తరం రాశారు. వీరిలో ప్రొఫెసర్ పద్మజా షా, డాక్టర్ పసునూరి రవీందర్, డాక్టర్ కె.లలిత, వసుధా నాగరాజ్, డాక్టర్ సునీత, గోగు శ్యామల, విజయా బండారి, సుశీ థారూర్, సూరేపల్లి సుజాత, సజయ, ప్రొఫెసర్ గుంటూరు లక్ష్మీనర్సయ్య లాంటి మేధావులు ఈ లేఖ రాసిన వారిలో ఉన్నారు. కత్తి మీద బహిష్కరణ వేటు సరికాదని ప్రభుత్వానికి సూచించారు. ఇది దళితులను అగౌరవపరిచినట్లే అన్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ సర్కారు పునరాలోచన చేసింది. అందుకే కొద్ది గంటల గ్యాప్ లోనే పరిపూర్ణానంద స్వామీజీ మీద కూడా నగర బహిష్కరణ వేటు పడింది. అర్థరాత్రిపూట పరిపూర్ణానందను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి తెలంగాణ పొలిమేరలు దాటించారు.
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంలో దళితులకు పెద్దగా గౌరవం దక్కడంలేదన్న విమర్శ బలంగా ఉంది. ఇటీవల అది బాగా ప్రచారం అవుతున్నది కూడా. కేసిఆర్ ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్లలోనే ఉపముఖ్యమంత్రిగా ఉన్న డాక్టర్ తాటికొండ రాజయ్యను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు. అది తెలంగాణలోని బలమైన మాదిగ సామాజికవర్గంలో కొంత వ్యతిరేకత వచ్చింది. దాంతోపాటు మాదిగ జాతికి నాయకుడిగా ఉన్న మంద క్రిష్ణ మాదిగను భయంకరంగా అణిచివేస్తానని అసెంబ్లీలో కేసిఆర్ ప్రకటించారు. మంద క్రిష్ణ మాదిగను రెండుసార్లు అరెస్టు చేశారు తెలంగాణ పోలీసులు. ఈ సంఘటన కూడా మాదిగ కులస్థుల్లో కొంత వ్యతిరేకతను నింపిందన్న ప్రచారం ఉంది. దీనికితోడు దళిత వాడల్లో దారిద్రాన్ని తరిమికొట్టడమే తన లక్ష్యం అంటూ కేసిఆర్ తెలంగాణ వచ్చిన రోజుల్లో ప్రకటించారు. అందుకోసమే పేద దళితులకు మూడెకరాల భూమి స్కీం ప్రకటించారు. ఎస్సీ డెవలప్ మెంట్ శాఖను తన వద్దే ఉంచుకుంటానని ప్రకటించారు. కానీ మూడెకరాల స్కీం ఆచరణలో ఫెయిల్ అయింది. పెద్దగా భూములు సమకూర్చలేకపోయింది సర్కారు. తనవద్దే ఎస్సీ డెవలప్ మెంట్ శాఖను ఉంచుకుంటున్నానని, తానే స్వయంగా పర్యవేక్షిస్తానన్న శాఖను కొంతకాలం తర్వాత కేసిఆర్ మంత్రి జగదీష్ రెడ్డికి అప్పగించారు. దీనికితోడు ఇటీవల పలువురు దళిత ఐఎఎస్, ఐపిఎస్ లు తమకు ప్రాధాన్యత లేని పోస్టులు కట్టబెడుతున్నారని, తెలంగాణ ప్రభుత్వానికి ఒక ఫిర్యాదు చేశారు. సివిల్ సర్వెంట్లంతా వచ్చి సిఎస్ కు ఫిర్యాదు చేయడం ప్రభుత్వ వర్గాల్లో కలవరం రేపింది. కేవలం అగ్రవర్ణాల సివిల్ సర్వీసు అధికారులకే ప్రాధాన్యత కలిగిన పోస్టులు దక్కుతున్నాయని వారు సీరియస్ అలిగేషన్స్ చేశారు.
ఈ పరిస్థితుల్లో కత్తి మహేష్ ను నగర బహిష్కరణ చేస్తే పాత ఇష్యూలకు ఇది కూడా జత కలిసే అవకాశం ఉందని కేసిఆర్ భావించినట్లు చెబుతున్నారు. అసలే తెలంగాణ సర్కారు మీద దళితులు గుర్రుగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మరో సమస్యను ఎదుర్కోవడం ఇష్టంలేకనే కత్తి మహేష్ తో పాటు పరిపూర్ణానంద మీద కూడా నగర బహిష్కరణ వేటు పడిందని చెబుతున్నారు. కత్తి మహేష్ ను బహిష్కరించిన ప్రభుత్వం బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ను ఎందుకు వదిలేసిందంటూ ఎంబిటి నేత అమ్జదుల్లాఖాన్ ప్రశ్నించారు. రాజాసింగ్ తీవ్రమైన విమర్శలు చేశారని, 30 కేసులు రాజాసింగ్ మీద పెండింగ్ లో ఉన్నయని ఖాన్ పేర్కొన్నారు. కేవలం కత్తి మహేష్ నే బహిష్కరించడం వివక్ష చూపడమే అన్నారు. ఈ పరిస్థితుల్లో దళితుల్లో మరింత వ్యతిరేకత రాకుండా ఉండేందుకే తెలంగాణ సర్కారు పరిపూర్ణానంద మీద వేటు వేసి బ్యాలెన్స్ చేసినట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.