తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను చూసే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకోవాలని చూస్తోందన్నారు. అసలు భారతదేశ చరిత్రలోనే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకోని రెండు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒకటని అన్నారు.
అసలు విషయం ఏంటంటే.. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు రెెండో రోజున.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మాణంపై కేసీఆర్ మాట్లాడారు. అయితే కేసీఆర్ ప్రసంగానికి కాంగ్రెస్ సభ్యులు పదే పదే అడ్డు తగులుతుండటంతో కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటయ్యాక 33 జిల్లాలు ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ నేతలు కొందరు వద్దని అడ్డుకోవాలని చూస్తే.. మరి కొందరు కావాలని డిమాండ్ చేశారని అన్నారు. వాళ్లలో వాళ్లకే సఖ్యత లేదని, క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు. అసలాగే.. అసలు భారత దేశ చరిత్రలో అన్ని రాష్ట్రాలు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకుంటే.. పశ్చిమబెంగాల్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాత్రమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకోలేదని అన్నారు.
అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణను చూసే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకోబోతోందని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ తనతో మాట్లాడి చెప్పిన దాని మేరకు ఏపీలో 25 జిల్లాలు ఏర్పాటు చేయబోతున్నారని కూడా కేసీఆర్ ప్రకటించేశారు.