దశాబ్దాలుగా కమ్యూనిస్టులకు కోటలుగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. మూస సిద్ధాంతాలతో మసకబారుతున్నాయి. మచ్చలేని ప్రజా నాయకులుగా వెలిగిన వారు.. పలుమార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన వారు.. ఇప్పుడు ఆర్థిక స్థోమత లేక రాజకీయ భవిష్యత్తు అంధకారమై.. తమ ప్రాంతాలపై పట్టు కోల్పోతున్నారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే, సీపీఐ సీనియర్ నేత గుండా మల్లేశ్.. సింగరేణి కార్మికుని స్థాయి నుండి ఎమ్మెల్యేగా ఎదిగారు. 1983లో ఆసిఫాబాద్ సీపీఐ అభ్యర్థిగా గెలిచారు. 1985, 1994 అలాగే 2009లో నియోజకవర్గాల పునర్విభజన అనంతరం బెల్లంపల్లి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కానీ ఇప్పుడు ఈ విజయాలు చెప్పుకోడానికే తప్ప రాజకీయాల్లో ప్రభావం చూపించేవిగా లేవు. పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కమ్యూనిస్టు భావజాలం పట్ల ప్రజలు విముఖత చూపిస్తున్నారు. ఆర్థిక మూలాలు బలంగా ఉన్న నేతలైతే అన్ని విధాలా ఆదుకుంటారని వారివైపే మొగ్గుచూపుతున్నారు.
సొంతంగా ఎక్కడా పోటీ చేసే సామర్థ్యం లేక.. పొత్తులతో గెలవడం, లేదా మచ్చలేని నాయకులు కాబట్టి ఒకటీ, అరా చోట్ల కమ్యూనిస్టులకు పార్టీలు స్థానాలు ఇవ్వడం తప్పితే.. వారు గెలిచే అవకాశాలే లేవనే విమర్శలు సర్వత్రా ఉన్నాయి. అందుకే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా సరే మల్లేష్ రాజకీయ భవిష్యత్తు ఇక ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది. ఇది కేవలం ఆయన స్థితే కాదు.. ఆయన లాంటి మరి కొందరి నేతల పరిస్థితి కూడా. అఖిల పక్ష సమావేశాలకనో.. ప్రతిపక్ష పార్టీలో పోరాటానికి పనికొచ్చే పార్టీలుగానో మిగలడం తప్ప ఆ పార్టీలు పెద్దగా చేస్తున్న ప్రయత్నాలు కూడా ఏమీ లేనట్లే ఉన్నాయి. ఇలానే ఉంటే మరో దశాబ్దానికి కమ్యూనిస్టు నేతలను చరిత్ర పుస్తకాల్లో తప్ప నిజ జీవితంలో చూసే పరిస్థితి ఉండకపోవచ్చనే రాజకీయ విశ్లేకుల మాట.