కేసీఆర్.. పాలనా పరంగా భిన్నమైన నాయకుడు. ప్రజలు సంక్షేమమే ప్రధానం ఆ తర్వాతే ఏదైనా అనే తత్వం ఉన్న వ్యక్తి. అసలు తెలంగాణ సాధించుకున్నదే రైతుల కోసం అంటూ అధికారం చేపట్టిన దగ్గర్నుండి వారి కోసమే సంక్షేమ పథకాలు రూపొందిస్తూ వాటిని సమర్థవంతంగా అమలుచేస్తున్న నాయకుడు. రాష్ట్ర రైతాంగం బాగు కోసం భగీరథ ప్రయత్నాన్ని భుజానికెత్తుకున్న ఆయన కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టును శరవేగంగా పూర్తిచేసి రాష్ట్రానికి జలకళ సంపాదించారు. ఇక రెండో అడుగుగా వ్యవసాయ పద్దతుల ప్రక్షాళనకు నడుంబిగించారు.
ఇకపై రాష్ట్రంలోని రైతులంతా ప్రభుత్వం సూచించిన పంటలనే వేయాలి.. అలా వేసిన వారికే రైతు బంధు లాంటి సంక్షేమ పథకాలు అందుతాయని అల్టిమేటం జారీ చేశారు. ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా పంటలు వేయాలనే నిబంధన ఇదివరకే ఉన్నా ఇకపై అది పక్కాగా అమలుకానుంది. ఇకపై వ్యవసాయ అధికారులు ఏ ప్రాంతంలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేయాలి అనేది స్వయంగా సూచిస్తారు. ఆ మేరకే రైతులు పంటలు వేయాలి.
ఇలా చేయడం ద్వారా ఒకే రకమైన పంట అవసరానికి మించి ఉత్పత్తి కావడం, ఆ తర్వాత దానికి మార్కెట్లో గిట్టుబాటు ధర దొరక్క రైతులు నష్టపోవడం లాంటివి ఉండవు. ఏ పంటలకైతే ఎక్కువ గిరాకీ ఉందో ఆ పంటలనే వేసేలా రైతులను గైడ్ చేయనున్నారు అధికారులు. ఈ పద్దతిలో అన్ని రకాల పంటలు అవసరమైనంత మేర పండటం, రైతులకు లాభం చేకూరడం, భూసారం పెరగడం లాంటి లాభాలున్నాయి. ఈమేరకు త్వరలోనే సీఎం అధికారులతో సమావేశం నిర్వహించి పక్కా ప్రణాళికను సిద్దం చేయనున్నారు. ఒకరకంగా ఇది అమలులో ప్రభుత్వానికి పెద్ద ఛాలెంజ్ లాంటిదే. కానీ అసాధ్యం అనుకున్న అనేక పనుల్ని చేసి చూపిన కేసీఆర్ వ్యవసాయరంగ ముఖచిత్రాన్ని కూడా సమూలంగా మార్చివేస్తారనడంలో సందేహం లేదు.