Electric Bike: ఒక్క ఛార్జ్ తో ఏకంగా అన్ని కి.మీ ప్రయాణం.. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఫీచర్స్ మాములుగా లేవుగా?

ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న క్రేజ్ డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వాహన వినియోగదారుల సంఖ్య కూడా అంతకు అంతకూ పెరుగుతూనే ఉంది. పర్యావరణ కాలుష్యాన్ని ఈ ఎలక్ట్రిక్ వాహనాలు తగ్గిస్తుండడంతో గవర్నమెంట్ కూడా వీటికి పూర్తిగా మద్దతునిస్తోంది. ఇకపోతే ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్ లు, కార్లు విడుదల అయిన విషయం తెలిసిందే. వీటితో పాటు కొత్త కొత్త వాహనాలు కూడా మార్కెట్లోకి విడుదల అవుతూనే ఉన్నాయి. ఇకపోతే ప్రముఖ అల్ట్రా వైలెట్ సంస్థ దేశంలో కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను పరిచయం చేసింది.

వినియోగదారులు ఈ బైక్‌ను స్టాండర్డ్, రీకాన్ అనే రెండు వేరియంట్‌ లలో కొనుగోలు చేయవచ్చు. అల్ట్రా వైలెట్ ఎఫ్ 77 Mach 2 ఇ-బైక్ కేవలం 2.8 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 155 కి.మీ. ఇది టెస్లా ఎలక్ట్రిక్ కారు కంటే మూడు రెట్లు వేగవంతమైనది. టెస్లా కారు 100 kmph వేగాన్ని అందుకోవడానికి 5.6 సెకన్లు పడుతుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్‌ లో 10.3 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది 40.2బిహెచ్‌పి పవర్, 100ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ ఫుల్ ఛార్జింగ్‌తో 323 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. కొత్త అల్ట్రా వైలెట్ ఇ-బైక్‌లో 3-స్థాయి ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, 10-లెవల్ రీజెనరేటివ్ సిస్టమ్ ఉన్నాయి.

ఇది హిల్ హోల్డ్ అసిస్ట్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, డెల్టా వాచ్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి భద్రతా లక్షణాలను కూడా పొందుతుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్‌కు వైలెట్ AI మద్దతు ఇస్తుంది. దాని సహాయంతో మీరు బైక్ నుండి పడిపోయే అవకాశం ఉన్నప్పుడు మీకు హెచ్చరిక వస్తుంది. వీటిలో రిమోట్ లాక్‌డౌన్, క్రాష్ అలర్ట్, డైలీ రైడింగ్ స్టేటస్, యాంటీ కొలిజన్ వార్నింగ్ సిస్టమ్ ఉన్నాయి. ఏకా అల్ట్రా వైలెట్ F77 Mach 2 ఎలక్ట్రిక్ బైక్ ధర విషయానికి వస్తే.. ఈ వేరియంట్ ధర రూ.2.99 లక్షలు కాగా, రీకాన్ వేరియంట్ ధర రూ.3.99 లక్షలుగా ఉంది.