ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. టెక్నాలజీ అభివృద్ధి చెందటం వల్ల అన్ని పనులు చాలా సులువుగా అతి తక్కువ సమయంలోనే పూర్తి చేసుకుంటున్నారు. ముఖ్యంగా టెక్నాలజీ అభివృద్ధి చెందటం వల్ల నగదు బదిలీ చాలా సులభతరంగా మారిపోయింది. గతంలో ఒక అకౌంట్ నుండి మరొక అకౌంట్ కి డబ్బు ట్రాన్స్ఫర్ చేయడానికి తప్పనిసరిగా బ్యాంకుకు వెళ్లాల్సి ఉండేది. కానీ ప్రస్తుతం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వల్ల బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లో కూర్చొని నిమిషంలోనే ఒక అకౌంట్ నుండి మరొక అకౌంట్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయవచ్చు.
యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత దుకాణాల్లో కొనుగోళ్ల దగ్గర నుంచి వ్యక్తులకు నగదు బదిలీ, బిల్లుల చెల్లింపులన్నీ ఆన్లైన్ ద్వారానే జరుగుతున్నాయి. కానీ కొన్ని సందర్భాలలో ఒక అకౌంట్ కి బదులు మరొక అకౌంట్ కి పొరపాటున డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఇలా పొరపాటున డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఆ డబ్బు అందుకున్న కొందరు వ్యక్తులు వాటిని తిరిగి చెల్లిస్తారు. మరి కొంతమంది ఆ డబ్బు తిరిగి చెల్లించారు. ఇలా పొరపాటున ఒక అకౌంటు నుండి మరొక అకౌంట్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల చాలామంది నష్టపోతున్నారు. అయితే ఇలా పొరపాటున డబ్బు పంపినప్పుడు ఏమి చేయాలి? ఆ డబ్బు ఎలా తిరిగి పొందాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఆన్లైన్ లో డబ్బు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు పొరపాటున ఒక అకౌంట్ నుండి మరొక అకౌంట్ కి పంపిన డబ్బు మొత్తాన్ని తిరిగి పొందవచ్చని ఆర్బీఐ వెల్లడించింది. ఇలా జరిగినప్పుడు మొదటగా చెల్లింపు వ్యవస్థ ద్వారా బాధితుడు ఫిర్యాదు చేయాలని సూచించింది. అంటే పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్ లలో ఏ యాప్ ఉపయోగించి డబ్బు పంపామో..ఆయా కస్టమర్ సర్వీస్ ని సంప్రదించి జరిగిన విషయం గురించి వివరించి నగదు వాపసు కోరవచ్చు. అయితే మీ సమస్యను పరిష్కరించడంలో వారు విఫలమైతే వెంటనే ఆర్బీఐ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించి మీ డబ్బు తిరిగి పొందవచ్చు.