ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం రెడీ అవుతోంది. దాని విస్తీర్ణం అయిదో, పదో కాదు.. ఏకంగా 63 ఎకరాలు. ఇంత పెద్ద విస్తీర్ణంలో నిర్మించిన క్రికెట్ స్టేడియం ఎక్కడా లేదు. అలాంటిది మన దేశంలోనే నిర్మితమౌతోంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ శివార్లలోని మొతెరాలో ఈ స్టేడియాన్ని నిర్మిస్తున్నారు.
పాపులస్ సంస్థ ఈ స్టేడియం నిర్మాణాన్ని చేపట్టింది. నిర్మాణానికి 700 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. ఈ మొత్తాన్ని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ భరిస్తోంది. ఇందులోని సీట్ల సామర్థ్యం అక్షరాలా లక్ష. ఒకేసారి లక్ష మంది ప్రేక్షకులు ఎంచక్కా క్రికెట్ మ్యాచ్‌ను వీక్షించవచ్చు. సరే! అంత మంది ఒకేసారి స్టేడియానికి చేరుకోవాలంటే పార్కింగ్ సమస్యలు ఎదురవుతాయనే ప్రశ్నే తలెత్తదు.
ఎందుకంటే- మూడు వేల కార్లు, 10 వేల ద్విచక్ర వాహనాలను పార్క్ చేయడానికి వీలుంది. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఈ స్టేడియాన్ని నిర్మిస్తోంది. జీసీఏ ఉపాధ్యక్షుడు పరిమళ్ నాథ్వాని ఆదివారం స్టేడియం నిర్మాణ పనులను పర్యవేక్షించారు. అనంతరం కొన్ని ఫొటోలను ఆయన తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.