అబుదాబి : ఐపీఎల్ 2020 సీజన్‌లో తొలిసారి మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా ముగిసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో అబుదాబి వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ 8 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా టీమ్.. బెంగళూరు బౌలర్లు చాహల్ (2/15), వాషింగ్టన్ సుందర్ (1/14), నవదీప్ సైనీ (1/23) దెబ్బకి 8 వికెట్లు కోల్పోయి 84 పరుగులే చేయగలిగింది. ఆ జట్టులో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (30: 34 బంతుల్లో 3×4, 1×6) టాప్ స్కోరర్‌కాగా.. ఐదుగురు బ్యాట్స్‌మెన్‌లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అనంతరం ఛేదనలో దేవ్‌దత్ పడిక్కల్ (25: 17 బంతుల్లో 3×4), అరోన్ ఫించ్ (16: 21 బంతుల్లో 2×4), కెప్టెన్ విరాట్ కోహ్లీ (18 నాటౌట్: 17 బంతుల్లో 2×4), గుర్‌కీరత్ సింగ్ మన్ (21 నాటౌట్: 26 బంతుల్లో 4×4) నిలకడగా ఆడటంతో 13.3 ఓవర్లలోనే 85/2తో బెంగళూరు విజయాన్ని అందుకుంది. తాజా సీజన్‌లో 10వ మ్యాచ్ ఆడిన బెంగళూరుకి ఇది ఏడో గెలుపుకాగా.. 14 పాయింట్లతో ఆ జట్టు నెం.2 స్థానానికి ఎగబాకింది. కోల్‌కతా ఐదో ఓటమితో నాలుగో స్థానానికి పడిపోయింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ.. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే రాహుల్ త్రిపాఠి (1), నితీశ్ రాణా (0) వికెట్లని పడగొట్టిన మహ్మద్ సిరాజ్.. ఆ జట్టుని ఒత్తిడిలోకి నెట్టేశాడు. ఆ తర్వాత ఓవర్‌లో శుభమన్ గిల్ (1)ని నవదీప్ సైనీ బోల్తా కొట్టించేయడంతో ఆ టీమ్ 3/3తో పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన టామ్ బాంటన్ (10: 8 బంతుల్లో 1×4, 1×6) భారీ షాట్లు ఆడే సిరాజ్‌కి వికెట్ సమర్పించుకోగా.. దినేశ్ కార్తీక్ (4: 14 బంతుల్లో).. చాహల్ బౌలింగ్‌లో అతి జాగ్రత్తగా ఆడబోయే మూల్యం చెల్లించుకున్నాడు. ఒక వైపు వికెట్లు పడుతున్నా.. మొండిగా క్రీజులో నిలిచిన ఇయాన్ మోర్గాన్ ఆ టీమ్‌కి గౌరవమైన స్కోరు అందించేలా కనిపించాడు. కానీ అతని పోరాటం ఫలించలేదు. ఆఖర్లో పాట్ కమిన్స్ (4) తేలిపోయినా.. కుల్దీప్ యాదవ్ (12: 19 బంతుల్లో 1×4), లూకీ ఫర్గూసన్ (19: 16 బంతుల్లో 1×4) కాసేపు క్రీజులో నిలవడంతో కోల్‌కతా 84 పరుగులైనా చేయగలిగింది.
Mohammed Siraj is our Man of the Match for his brilliant bowling figures of 3/8.
Absolute gold from the pacer.#Dream11IPL pic.twitter.com/OCt6VeB93G
— IndianPremierLeague (@IPL) October 21, 2020
బెంగళూరు బౌలర్లలో సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేసి.. మూడు వికెట్ల పడగొట్టాడు. యుజ్వేంద్ర చాహల్ 2, నవదీప్ సైని, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ సాధించారు. ఈ మ్యాచ్‌లో నాలుగు మెయిడిన్ ఓవర్లు వచ్చాయి. సిరాజ్ 2, క్రిస్ మోరిస్, వాషింగ్టన్ సుందర్ తలో మెయిడిన్ ఓవర్ వేశారు. ఐపీఎల్ చరిత్రిలో నాలుగు మెయిడిన్ ఓవర్లు నమోదవడం ఇదే తొలిసారి. ఇక ఈ మ్యాచ్‌లో హైదరాబాదీ ప్లేయర్ మహమ్మద్ సిరాజ్ సంచలనం సృష్టించాడు. 4 ఓవర్లలో కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు మెయిడిన్ ఓవర్లు కూడా ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో రెండు వరుస ఔవర్లను మెయిడిన్ చేసిన మొట్ట మొదటి బౌలర్‌గా రికార్డు సాధించాడు సిరాజ్. అంతేకాదు ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.