IPL -2020: పంజాబ్ జట్టుపై గెలిచి.. ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకున్న రాజస్థాన్ రాయల్స్‌

Rajasthan Royals won by 7 wickets on punjab

ఐపీఎల్ 2020, అబుదాబి: ఈ ఐపీఎల్ సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ జోరుకి రాజస్థాన్ రాయల్స్‌ శుక్రవారం రాత్రి పుల్ స్టాప్ పెట్టింది .అబుదాబిలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుపై గెలిచి.. ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది ఆర్ఆర్ టీమ్. 186 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా రాయల్స్ బ్యాట్స్‌మెన్ చాలా అలవోగా చేధించారు. 3 వికెట్లు కోల్పోయి 17.3 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించారు.

Rajasthan Royals won by 7 wickets on punjab
Rajasthan Royals won by 7 wickets on punjab

అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత క్రిస్‌గేల్ (99: 63 బంతుల్లో 6×4, 8×6) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడటంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ టీమ్ 4 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో బెన్‌స్టోక్స్ (50: 26 బంతుల్లో 6×4, 3×6), సంజు శాంసన్ (48: 25 బంతుల్లో 4×4, 3×6) దూకుడుగా ఆడటంతో రాజస్థాన్ టీమ్ 17.3 ఓవర్లలోనే 186/3తో అలవోకగా విజయాన్ని అందుకుంది. తాజా సీజన్‌లో 13వ మ్యాచ్ ఆడిన రాజస్థాన్‌కి ఇది ఆరో గెలుపుకాగా.. పంజాబ్ టీమ్‌కి ఏడో ఓటమి. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే రెండు జట్లు ఇప్పుడు చివరి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది.

Rajasthan Royals won by 7 wickets on punjab
Rajasthan Royals won by 7 wickets on punjab

ముంబయితో గత ఆదివారం మ్యాచ్‌లో సెంచరీ సాధించిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ బెన్‌స్టోక్స్ శుక్రవారం రాత్రి మ్యాచ్‌లోనూ వరుస బౌండరీలతో చెలరేగిపోయాడు. రాబిన్ ఉతప్ప (30: 23 బంతుల్లో 1×4, 2×6)తో కలిసి 5.3 ఓవర్లకే 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన బెన్‌స్టోక్స్.. హాఫ్ సెంచరీని పూర్తిచేసుకున్నాడు. ప్రమాదకరంగా మారిన బెన్‌స్టోక్స్‌ని క్రిస్ జోర్దాన్ ఔట్ చేయగా.. అనంతరం వచ్చిన సంజు శాంసన్‌ కూడా అదే తరహాలో దూకుడుగా ఆడేశాడు. దాంతో.. పంజాబ్ బౌలర్లకి పుంజుకునే అవకాశమే లేకపోయింది. అయితే.. టీమ్ స్కోరు 111 వద్ద ఉతప్ప ఔటవగా.. ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో సంజు శాంసన్ ఔటయ్యాడు. అయినప్పటికీ.. అప్పటికే మ్యాచ్ రాజస్థాన్ చేతుల్లోకి వచ్చేసింది. దాంతో.. చివర్లో స్టీవ్‌స్మిత్ (31 నాటౌట్: 20 బంతుల్లో 5×4), జోస్ బట్లర్ (22 నాటౌట్: 11 బంతుల్లో 1×4, 2×6) స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించేసి మరో 15 బంతులు మిగిలి ఉండగానే గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో.. కేఎల్ రాహుల్ (46: 41 బంతుల్లో 3×4, 2×6)తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన మన్‌దీప్ సింగ్ (0) తొలి ఓవర్‌లోనే ఔటైపోయాడు. అనంతరం వచ్చిన క్రిస్‌గేల్ ఆరంభం నుంచే భారీ సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గేల్.. రాహుల్‌తో కలిసి రెండో వికెట్‌కి 161 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దాంతో.. ఒకానొక దశలో పంజాబ్ 200పై చిలుకు స్కోరు చేసేలా కనిపించింది. కానీ.. రాహుల్ ఔట్ తర్వాత క్రిస్‌గేల్ కాస్త నెమ్మదించగా.. క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ (22: 10 బంతుల్లో 3×6) భారీ షాట్లు ఆడేశాడు. ఇక చివరి ఓవర్‌లో 93 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జోప్రా ఆర్చర్‌కి సిక్స్ కొట్టి 99‌లోకి వచ్చిన గేల్.. తర్వాత బంతికే ఔటైపోయాడు. చివర్లో మాక్స్‌వెల్ (6 నాటౌట్: 6 బంతుల్లో 1×4) నిరాశపరిచాడు. రాజస్థాన్ బౌలర్లలో జోప్రా ఆర్చర్, బెన్‌ స్టోక్స్ రెండేసి వికెట్లు పడగొట్టారు.