MI vs CSK , sarjah : ఈ ఐపీఎల్ సీజన్లో చెన్నై ఘోరంగా విఫలమైంది.చెన్నై టీం అనగానే నమ్మకానికి , స్థిరత్వానికి నిదర్శనంగా ఉండేది.కానీ ఈ సంవత్సరం అంతా తల క్రిందులయిపోయింది . చెన్నై టీం లో అందరూ సీనియర్స్ తో ఈ సీజన్లో మొదట విఫలమవుతున్న తరుణంలో జట్టులోకి కుర్రాళ్లు వచ్చినా తలరాత మారలేదు. అదే వైఫల్యాన్ని కొనసాగించి.. ప్లేఆఫ్స్‌కు దాదాపు దూరమైంది. షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై చేతిలో ఘోర పరాజయం చూసింది. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లో దారుణమైన ప్రదర్శన కనబరిచి.. చిత్తుగా ఓడింది. చెన్నై టీమ్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ముంబై జట్టు. ఓపెనర్లు క్వింటన్ డికాక్, ఇషాన్ కిషన్ ఇద్దరే టీమ్‌ను గెలిపించారు. డికాక్ 37 బంతుల్లో 46 (2 సిక్స్‌లు, 5 ఫోర్లు), ఇషాన్ కిషన్ 37 బంతుల్లో 68 (5 సిక్స్‌లు, 6 ఫోర్లు) పరుగులతో అదరగొట్టారు. ఏ మాత్రం తడబడకుండా.. ఆడుతూ పాడుతూ.. భారీ షాట్లూ కొడుతూ.. జట్టుకు భారీ విజయాన్ని అందించారు. 12.2 ఓవర్లలోనే 115 లక్ష్యాన్ని చేధించారు. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ టీమ్.. పాయింట్ల పట్టిలో మూడో స్థానం నుంచి నెంబర్ వన్ పొజిషన్‌కు దూసుకెళ్లింది.
#MumbaiIndians WIN by 10 wickets.#Dream11IPL pic.twitter.com/NeUUpWME7I
— IndianPremierLeague (@IPL) October 23, 2020
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 114 పరుగులుచేసింది. సామ్ కరన్ 52 పరుగులతో రాణించాడు. అతడు మినహా జట్టులో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. జట్టులోకి కుర్రాళ్లు వచ్చినప్పటికీ టీమ్ రాత మారలేదు. రుతురాజ్ 0, డుప్లెసిస్ 1, రాయుడు 2, జగదీశన్ 0, ధోనీ 16, జడేజా 7, దీపక్ చాహర్ 0, శార్దుల్ ఠాకూర్ 11, తాహిర్ 13 రన్స్ చేశారు. మ్యాచ్ ఆరంభంలోనే పీకల్లోతు కష్టాల్లో పడింది చెన్నై టీమ్. బోల్ట్, బుమ్రా దెబ్బకు సీఎస్‌కే టాప్ ఆర్డర్ విలవిల్లాడింది. మూడు ఓవర్లలో 3 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ధోనీ, జడేజా కూడా విఫలమయ్యారు. కాసేపు బాగానే ఆడినప్పటికీ.. వికెట్ల ముందు నిలబడలేకపోయారు. ఆరో ఓవర్‌లో జడేజా, ఏడో ఓవర్లో ధోనీ ఔట్ అయ్యారు. అనంతరం క్రీజులోకి వచ్చిన సామ్ కరన్.. ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు సాగించాడు. దీపక్ చాహర్ త్వరగా ఔట్ అయినా.. శార్దుల్ ఠాకూర్, తాహిర్‌తో కలిసి జట్టుకు విలువైన పరుగులు అందించాడు. కరన్ లేకుంటే చెన్నై ఆ మాత్రం స్కోరు కూడా సాధించేది కాదు. 60 లోపే ప్యాక్ అయ్యేది. ముంబై బౌలర్లలో బోల్ట్‌కు 4 వికెట్లు దక్కాయి. బుమ్రా, రాహుల్ చాహర్ చెరో రెండు వికెట్లు, కౌల్టర్‌నైల్ ఒక వికెట్ సాధించాడు.
ఐపీఎల్ 2020 టోర్నీలో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ టీమ్.. ఏడు మ్యాచ్‌ల్లో గెలిచింది. 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. మరో మూడు మ్యాచ్‌ల్లో మాత్రం పరాజయం పాలయింది ముంబై ఇండియన్స్. ఇక చెన్నై విషయానికొస్తే.. ఎప్పుడూ లేనంతగా ఈసారి దారుణంగా విఫలమవుతోంది. ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన ధోనీ సేన.. కేవలం మూడు మ్యాచ్‌లు గెలిచింది. మరో ఎనిమిది మ్యాచ్‌ల్లో ఓటమి పాలయింది. ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానంలో నిలిచింది.