ఐపీఎల్ 2020:వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోయిన హైదరాబాద్. బోణి కొట్టిన కోలకతా

kolkata beats hyderabad by 7 wickets

అబుదాబి:తొలి మ్యాచ్‌లో ముంబయి చేతిలో ఓడిన కోల్‌కతా నైట్‌రైడర్స్ బోణీ కొట్టింది.ఆ జట్టు తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.

kolkata beats hyderabad by 7 wickets
kolkata beats hyderabad by 7 wickets

ఐపీఎల్ 2020 సీజన్‌లో వరుసగా రెండో మ్యాచ్‌ల్లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి పరాజయం ఎదురైంది. అబుదాబి వేదికగా శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో తేలిపోయిన సన్‌రైజర్స్‌ని 7 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ అలవోకగా ఓడించేసింది. మ్యాచ్‌లో మనీశ్ పాండే (51: 38 బంతుల్లో 3×4, 2×6) హాఫ్ సెంచరీ బాదడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 4 వికెట్ల నష్టానికి 142 పరుగులే చేయగలిగింది. లక్ష్యాన్ని ఓపెనర్ శుభమన్ గిల్ (70 నాటౌట్: 62 బంతుల్లో 5×4, 2×6) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడటంతో కోల్‌కతా మరో 12 బంతులు మిగిలి ఉండగానే 145/3తో ఛేదించేసింది. తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో 10 పరుగుల తేడాతో హైదరాబాద్ ఓడిపోయిన విషయం తెలిసిందే.

143 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన కోల్‌కతా జట్టుని ఆరంభంలోనే ఓపెనర్ సునీల్ నరైన్ (0), నితీశ్ రాణా (26: 13 బంతుల్లో 6×4), దినేశ్ కార్తీక్ (0)లను ఔట్ చేయడం ద్వారా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒత్తిడిలోకి నెట్టగలిగింది. కానీ.. పట్టుదలతో క్రీజులో నిలిచిన శుభమన్ గిల్ సమయోచిత హిట్టింగ్‌తో అదరగొట్టాడు. అతనికి ఆఖర్లో ఇయాన్ మోర్గాన్ (42 నాటౌట్: 29 బంతుల్లో 3×4, 2×6) తోడవడంతో 18 ఓవర్లలోనే కోల్‌కతా 145/3తో లక్ష్యాన్ని ఛేదించేయగలిగింది.

మ్యాచ్‌లో అంతకముందు టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే.. మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (5: 10 బంతుల్లో) నిరాశపరచగా.. అనంతరం వచ్చిన మనీశ్ పాండే‌తో కలిసి డేవిడ్ వార్నర్ (36: 30 బంతుల్లో 2×4, 1×6) నెమ్మదిగా ఇన్నింగ్స్ నడిపించాడు. కానీ.. ఇన్నింగ్స్‌ 10వ ఓవర్‌లో మిథున్ చక్రవర్తి విసిరిన బంతిని అర్థం చేసుకోలేక వార్నర్ ఔటవగా.. అనంతరం వచ్చిన సాహా (30: 31 బంతుల్లో 1×4, 1×6) ఆశించినంత వేగంగా ఆడలేకపోయాడు. అయితే.. చివర్లో మహ్మద్ నబీ (11 నాటౌట్: 8 బంతుల్లో 2×4) రెండు బౌండరీలు బాదడంతో హైదరాబాద్ కనీసం 142 పరుగులైనా చేయగలిగింది.