అబుదాబి: ఐపీఎల్ 2020 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో ఓటమి ఎదురైంది. డేవిడ్ వార్నర్(33 బంతుల్లో 47 నాటౌట్) అద్భుత పోరాటంతో సూపర్ ఓవర్‌కు దారితీసిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ థ్రిల్లింగ్ విక్టరీని అందుకుంది. ఫెర్గూసన్ అద్భుత బౌలింగ్‌కు సూపర్ ఓవర్‌లో మూడు బంతులే ఆడిన హైదరాబాద్ రెండు పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. ఫస్ట్ బాల్‌కే వార్నర్ క్లీన్ బౌల్డ్ కాగా.. అబ్దుల్ సమద్ సెకండ్ బాల్‌కు క్విక్ డబుల్ తీసి మూడో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక రషీద్ వేసిన ఓవర్‌లో కేకేఆర్ నాలుగు బంతుల్లో మూడు పరుగులు చేసి సునాయసంగా గెలుపొందింది.
That's that from Match 35.@KKRiders win in the Super Over against #SRH.#Dream11IPL pic.twitter.com/KooTSzHDyH
— IndianPremierLeague (@IPL) October 18, 2020
ఈ విజయంతో కేకేఆర్ తమ ప్లే ఆఫ్ ఆశలను మెరుగుపర్చుకోగా.. హైదరాబాద్ మరింత సంక్లిష్టం చేసుకోంది. 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలు మాత్రమే అందుకున్న హైదరాబాద్ 5వ స్థానంలో ఉంది. మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న ఆర్‌సీబీ, కోల్‌కతా ఇతర మ్యాచ్‌ల్లో ఓడి.. సన్‌రైజర్స్ 5కు 5 గెలిస్తేనే ప్లే ఆఫ్‌కు క్వాలిఫై అవుతుంది.
అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 రన్స్ చేసింది. ఇయాన్ మోర్గాన్( 23 బంతుల్లో 34), దినేశ్ కార్తీక్ (14 బంతుల్లో 29 నాటౌట్) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ రెండు వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్, విజయ్ శంకర్, బసిల్ థంపీ ఒక వికెట్ తీశాడు. అనంతరం హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 163 పరుగులే చేసింది. వార్నర్‌తో పాటు బెయిర్ స్టో(36), విలియమ్సన్(29) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో ఫెర్గూసన్ మూడు వికెట్లు తీయగా.. కమిన్స్, మావీ,వరుణ్ తలో వికెట్ పడగొట్టారు.
164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మంచి శుభారంభం దక్కింది. కేన్ విలియమ్సన్(19 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 29), బెయిర్ స్టో(28 బంతుల్లో 7 ఫోర్లుతో 36)లను ఓపెనర్లుగా పంపిస్తూ ఆరెంజ్ ఆర్మీ చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. పవర్ ప్లేలో ధాటిగా ఆడిన ఈ జోడీ వికెట్ నష్టపోకుండా 58 పరుగులు చేసింది. అనంతరం ఫెర్గూసన్ వేసిన ఫస్ట్ బాల్‌కే విలియమ్సన్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. విలియమ్సన్ థర్డ్ మ్యాన్ దిశగా భారీ షాట్ ఆడగా.. బౌండరీ లైన్ వద్ద నితీష్ రాణా అందుకున్నాడు. ఇక ఫెర్గూసన్ తన మరుసటి ఓవర్‌లో ప్రియమ్ గార్గ్(4)క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో బెయిర్ స్టో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
ఆ వెంటనే ఫెర్గూసన్ సూపర్ యార్కర్‌కు మనీష్ పాండే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో మంచి ఆరంభాన్ని అందుకున్న హైదరాబాద్ 82 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్ డెవిడ్ వార్నర్.. క్రీజులోకి వచ్చిన విజయ్ శంకర్‌తో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ శంకర్(7) కమిన్స్ బౌలింగ్‌లో పేలవ షాట్ ఆడి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఇక అబ్దుల్ సమద్ వచ్చి రావడంతోనే భారీ సిక్సర్ కొట్టాడు. వార్నర్‌కు మంచి సహకారం అందించాడు. దాంతో హైదరాబాద్ విజయానికి 12 బంతుల్లో 30 రన్స్ అవసరమయ్యాయి.
శివం మావి వేసిన 19వ ఓవర్‌లో వార్నర్ రెండు ఫోర్లు కొట్టగా.. ఆఖరి బంతికి సమద్ భారీ షాట్ ఆడగా.. ఫెర్గూసన్ బౌండరీ లైన్ వద్ద స్టన్నింగ్ క్యాచ్‌తో ఔరా అనిపించాడు. దాంతో హైదరాబాద్ 6 పరుగులు కోల్పోవడంతో పాటు కీలక వికెట్ చేజార్చుకుంది. ఇక చివరి ఓవర్‌లో విజయానికి 17 రన్స్ అవసరం కాగా.. రస్సెల్ తొలి బంతిని నోబాల్‌గా వేసాడు. దీంతో ఫ్రీహిట్ రాగా.. రషీద్ ఖాన్ కొట్టిన షాట్ నేరుగా బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్ చేతిలో పడింది. అనంతరం వార్నర్ 3 ఫోర్లు కొట్టి క్విక్ డబుల్ తీసాడు. దాంతో ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. కానీ సింగిలే రావడంతో మ్యాచ్ టై అయింది.
దాంతో.. స్కోర్లు సమమవగా.. సూపర్ ఓవర్‌ని నిర్వహించారు. అయితే.. ఈ సూపర్ ఓవర్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. కోల్‌కతా ఫాస్ట్ బౌలర్ ఫెర్గూసన్ దెబ్బకి తొలి మూడు బంతులకి డేవిడ్ వార్నర్, అబ్దుల్ సమద్ వికెట్లు చేజార్చుకుని రెండు పరుగులే చేసింది. దాంతో.. 3 పరుగుల ఛేదనకి దిగిన కోల్‌కతా వికెట్ చేజార్చుకోకుండా నాలుగో బంతికే విజయాన్ని అందుకుంది. సూపర్ ఓవర్‌లో రషీద్ బౌలింగ్ చేయగా.. దినేశ్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్ చాకచక్యంగా మ్యాచ్‌ని ఫినిష్ చేశారు. సీజన్‌లో 9వ మ్యాచ్ ఆడిన హైదరాబాద్‌కి ఇది ఆరో ఓటమికాగా.. కోల్‌కతాకి ఐదో గెలుపు.