భారత ఆటగాళ్ళతో పాటు విదేశీ ఆటగాళ్లు కలిసి దాదాపు రెండు నెలల పాటు క్రికెట్ ప్రేమికులకి ఐపీఎల్‌తో పసందైన వినోదం అందిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సారి కరోనా వలన ఐపీఎల్ నిర్వహించడం కష్టతరమని అందరు భావించినప్పటికీ, దానిని సజావుగా జరిగేలా చూశారు. బయోబబుల్ వాతావరణంలో విదేశీ ఆటగాళ్ళతో కలిసి భారత ఆటగాళ్లు అలరించారు. ఐపీఎల్ 2020లో ముంబై ఇండియన్స్ టీం విజేతగా నిలిచి అబ్బురపరిచింది. ఇక ఐపీఎల్ 2021 గురించి కొద్ది రోజులుగా ఆసక్తికర చర్చ నడుస్తుంది. ప్రతి సీజన్‌లో 8 జట్లు ఆడుతుండగా, ఈ సారి 10 టీంలు ఆడనున్నాయని ప్రచారం జరిగింది. దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోమవారం తెరదించింది.
ప్రతి టోర్నీలో 8 జట్లతో ఐపీఎల్ నడుస్తుండగా, వచ్చే ఏడాది మాత్రం మరో రెండు జట్లను కొత్తగా తీసుకురాబోతున్నారని కొన్ని నెలలుగా పుకార్లు షికారు చేశాయి. ఈ నేపథ్యంలో 8 జట్లతోనే వచ్చే ఏడాది టోర్నీ ఉంటుందని బిసీసీఐ చెప్పుకొచ్చింది. అహ్మదాబాద్ వేదికగా గురువారం బీసీసీఐ వార్షిక సమావేశం జరగనుండగా.. ఈ మీటింగ్ తర్వాత అధికారికంగా ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆడే జట్ల సంఖ్యపై బీసీసీఐ ఓ ప్రకటనని విడుదల చేయనున్నట్లు సమాచారం
2021లో ఎనిమిది జట్లతోనే ఆడించి 2022లో మాత్రం 10 జట్లతో ఆడించాలని బీసీసీఐ యోచిస్తున్నట్టు సమాచారం. 2008 నుండి ఐపీఎల్ జరుగుతుండగా, ఇది ఆదాయంతో పాటు ఆదరణ భారీగా పెంచుకుంది. మధ్యలో కొన్ని కారణాల వలన కొన్ని జట్లు యాడ్ అవడం, తర్వాత తొలగింపు వంటివి జరిగాయి. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ టీంలు దాదాపు ప్రతి సీజన్‌లో ఫేవరేట్స్‌గా బరిలోకి దిగుతుంటాయి. 2022 ఐపీఎల్ తర్వాత ధోని పొట్టి క్రికెట్ సిరీస్‌కు కూడా గుడ్ బై చెప్పనున్నాడనే టాక్ నడుస్తుంది.