క్రికెట్,ఐపీఎల్ అభిమానుల నిరీక్షణకు తెరపడింది. ఐపీఎల్ టోర్నీని పూర్తి చేస్తామని బీసీసీఐ ముందునుంచి చెబుతున్నట్లుగానే మాటని నిలబెట్టుకుంది. యూఏఈ వేదికగా ఐపీఎల్ కంటిన్యూ అవుతుందని బీసీసీఐ తాజాగా తెలిపింది. కరోనా కేసులు తగ్గినప్పటికీ భారత్‌లో వర్షాకాలం దగ్గరవటంతో ఎలాగూ సాధ్యం కాదని భావించి టోర్నీని యూఏఈకి తరలించినట్లుగా తెలుస్తుంది.
ఐపీఎల్ జట్లలో కరోనా కేసులు నమోదవడంతో ఈ నెల 4న టోర్నీని బీసీసీఐ వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ 2021 సీజన్‌లో మొత్తం 60 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా… 29 మ్యాచ్‌లు మాత్రమే ముగిశాయి. ఇక మిగిలిన 31 మ్యాచ్‌లను యూఏఈ లో జరిపేందుకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుతో తాజాగా జరిపిన చర్చలు విజయవంతమయ్యాయని బీసీసీఐ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.
కరోనా కారణంగా ఐపీఎల్ 2020 సీజన్ మొత్తాన్ని యూఏఈ వేదికగా బీసీసీఐ గత ఏడాది సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఐపీఎల్ 2021 సీజన్ లో మిగిలిన 31 మ్యాచ్‌లను సెప్టెంబర్ 19 నుంచి దుబాయ్, అబుదాబి, షార్జా వేదికలలో నిర్వహిస్తామని బీసీసీఐ ప్రకటించింది. ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 15 దసరా రోజున జరగనుంది.
ఇప్పటికే కొందరు విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండలేమని తమ స్వదేశాలకి వెళ్లిపోయారు. మరి ఇప్పుడు యూఏఈ లో జరగబోతున్న మ్యాచ్ లకు విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉంటారా లేదో అన్నది తెలియాల్సి ఉన్నది. ఇదివరకే బీసీసీఐ ఉపాధ్యక్షడు రాజీవ్ శుక్లా విదేశీ ఆటగాళ్లు వచ్చినా, రాకపోయినా లీగ్‌ను మాత్రం కంటిన్యూ చేస్తామని స్పష్టం చేశారు. ఐపీఎల్ 2021 సీజన్ ముగిసిన తర్వాత అక్టోబరు 18 నుంచి టీ20 వరల్డ్‌కప్ ప్రారంభంకానుంది.