IPL 2020: సీఎస్‌కేను వణికించిన సన్‌రైజర్స్‌.. సూపర్బ్‌ విక్టరీ

దుబాయ్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) సీజన్‌ 13లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వరుసగా రెండో విజయాన్ని అందకుంది. గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించిన ఆరెంజ్‌ ఆర్మీ ఈరోజు జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ను వణికించింది. దుబాయ్‌ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ధోని సేనపై సన్‌రైజర్స్‌ 7 పరుగుల తేడాతో సూపర్బ్‌ విక్టరీని అందుకుంది. దీంతో సీఎస్‌కే ఖాతాలో వరుసగా మూడో ఓటమి (హ్యాట్రిక్‌) కాగా సన్‌రైజర్స్‌కు వరుసగా రెండో విజయం కావడం విశేషం. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 157 పరుగులే చేసి ఓటమి మూటగట్టుకుంది.

లక్ష్య ఛేదనలో సీఎస్‌కే టాపార్డర్‌ బ్యాట్స్‌మన్‌ చేతులెత్తేశారు. షేన్‌ వాట్సన్‌ (1) మరోసారి ఘోరంగా విఫలం కాగా.. అంబటి రాయుడు (8), కేదార్‌ జాదవ్‌ (3) పెవిలియన్‌కు క్యూ కట్టారు. అయితే ఓ మోస్తారుగా ఆడుతున్న డుప్లెసిస్‌ (22) లేని పరుగు కోసం యత్నించి రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో 42 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన సీఎస్‌కే పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో జట్టు ఆదుకునే బాధ్యతను ధోనితో పాటు రవీంద్ర జడేజా తీసుకున్నారు. ముఖ్యంగా జడేజా స్కోర్‌ బోర్డు పరుగులు పెట్టించగా ధోని సపోర్టింగ్‌ రోల్‌ పోషించాడు. ఈ క్రమంలో అర్ద సెంచరీ పూర్తి చేసుకున్న జడేజా ఔటవ్వడం, రన్‌రేట్‌ ఎక్కువగా ఉండటంతో ధోని విశ్వప్రయత్నం చేసినా చెన్నై జట్టును గెలిపించలేకపోయాడు.

అంతుకుముందు టాస్‌ గెలిచిటాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. జానీ బెయిర్‌స్టో పరుగులేమీ చేయకుండా నిష్క్రమించాడు. దాంతో క్రీజ్‌లోకి వచ్చిన మనీష్‌ పాండే బ్యాట్‌కు పనిచెప్పాడు. కాకపోతే మంచి టచ్‌లో ఉన్న సమయంలో మనీష్‌ పాండే(29; 21 బంతుల్లో 5 ఫోర్లు) ఔటయ్యాడు. శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో సామ్‌ కరాన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. దాంతో 47 పరుగుల వద్ద ఎస్‌ఆర్‌హెచ్‌ రెండో వికెట్‌ను కోల్పోయింది.మరో 22 పరుగుల వ్యవధిలో డేవిడ్‌ వార్నర్‌(28; 29 బంతుల్లో 3 ఫోర్లు)ను డుప్లెసిస్‌ అద్భుతమైన క్యాచ్‌తో ఔట్‌ చేయగా, ఆపై వెంటనే కేన్‌ విలియమ్సన్‌ రనౌట్‌గా ఔటయ్యాడు. దాంతో 69 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఆరెంజ్‌ ఆర్మీ.

ఈ క్లిష్ట సమయంలో సమయంలో యువ ఆటగాళ్లు ప్రియం గర్గ్‌-అభిషేక్‌లు దుమ్ములేపారు. సీఎస్‌కే బౌలింగ్‌ను ఓ ఆటాడుకున్న వీరిద్దరూ 76 పరుగులు జత చేశారు. అభిషేక్‌(31; 24 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) ఐదో వికెట్‌గా ఔటయ్యాడు. ఆపై ప్రియం గర్గ్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కడవరకూ క్రీజ్‌లో ఉన్న ప్రియం గర్గ్‌ 26 బంతుల్లో 6 ఫోర్లు, 1సిక్స్‌తో 51 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అబ్దుల్‌ సామద్‌ 8 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లకు 164 పరుగులు చేసింది. సీఎస్‌కే బౌలర్లలో దీపక్‌ చాహర్‌ రెండు వికెట్లు సాధించగా, శార్దూల్‌ ఠాకూర్‌, పీయూష్‌ చావ్లాలు తలో వికెట్‌ తీశారు.