షార్జా: టీ20 ఫార్మట్‌లో 224 పరుగుల ఛేదన అంటే చాలా కష్టం. అలాంటిది అవలీలగా, అలవోకగా సాధించేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2020లో భాగంగా ఆదివారం షార్జా వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ అద్భుతం చేసింది. రాహుల్ సేన నిర్దేశించిన 224 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి మరో మూడు బంతులు మిగిలుండగానే పూర్తిచేసింది. లక్ష్య ఛేదనలో ఐపీఎల్ సంచలన ఆటగాడు సంజూ శాంసన్ (85; 42 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లు), సారథి స్టీవ్ స్మిత్ (50) జట్టు విజయానికి గట్టి పునాది వేయగా.. రాహుల్ తెవాటియా (53) జట్టుకు విజయాన్ని అందించాడు. చివర్లో జోఫ్రా ఆర్చర్ (13 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో రాజస్తాన్ రాయల్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పంజాబ్ బౌలర్లలో షమీ మూడు వికెట్లు పడగొట్టాడు.
మయాంక్ శతకం, రాహుల్ పోరాటం వృథా
టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్.. ముందుగా కింగ్స్ పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దాంతో కింగ్స్ పంజాబ్ ఇన్నింగ్స్‌ను రాహుల్, మయాంక్‌లు ఆరంభించారు. వీరిద్దరూ వచ్చీ రావడంతోనే రాజస్తాన్ రాయల్స్‌కు చుక్కలు చూపించారు. ఏ బౌలర్‌ను విడిచిపెట్టకుండా మెరుపులు మెరిపించారు. ఈ క్రమంలోనే తొలుత మయాంక్ హాఫ్ సెంచరీ సాధించగా, ఆపై రాహుల్ అర్థ శతకం సాధించాడు. మయాంక్ ధాటిగా ఆడటంతో రాహుల్ ఎక్కువ స్టైక్ ఇస్తూ అతన్ని ఉత్తేజ పరిచాడు. దాన్ని సద్వినియోగం చేసుకున్న మయాంక్ సెంచరీ నమోదు చేశాడు.
వీరిద్దరూ తొలి వికెట్‌కు 183 పరుగులు జోడించారు. 50 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్స్‌లతో 106 పరుగులు చేసిన తర్వాత మయాంక్ తొలి వికెట్‌గా ఔటయ్యాడు. టామ్ కరాన్ బౌలింగ్‌లో మయాంక్ పెవిలియన్ చేరగా, రాజ్‌పుత్ బౌలింగ్‌లో రాహుల్ పెవిలియన్ చేరాడు. మయాంక్ ఔటైన మరుసటి ఓవర్‌లోనే రాహుల్ నిష్క్రమించాడు. 54 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 69 పరుగులు సాధించిన తర్వాత రాహుల్ రెండో వికెట్‌గా ఔటయ్యాడు. ఇక చివర్లో మ్యాక్స్‌వెల్(13 నాటౌట్; 9 బంతుల్లో 2ఫోర్లు), పూరన్(25 నాటౌట్; 8 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు)లు ధాటిగా ఆడటంతో కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది.