ఐపీఎల్‌ 2020: ఢిల్లీ దంచికొట్టే.. సీఎస్‌కే చతికిలపడే!

దుబాయ్‌ : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-2020లో శ్రేయాస్‌ అయ్యర్‌ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌ మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. గురువారం దుబాయ్‌ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 44 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ జట్టు సీఎస్‌కేకు 176 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఛేదనలో ఘోరంగా విఫలమైన సీఎస్‌కే నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్లు నష్టపోయి 131 పరుగులకే పరిమితమైంది. డుప్లెసిస్‌(43) మినహా మరోక సీఎస్‌కే బ్యాట్స్‌మన్‌ రాణించలేదు. అంతేకాకుండా ఢిల్లీ బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తూ, వరుసగా వికెట్లు పడగొట్టి విజయాన్ని అందించారు. ఢిల్లీ బౌలర్లు రబడ (3/26), అన్రిచ్‌ (2/21) రాణించారు. అర్దశతకంతో మెరిసిన పృథ్వీ షాకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీ షా (64; 43 బంతుల్లో 9×4, 1×6), శిఖర్‌ ధావన్ ‌(35; 27 బంతుల్లో 3×4, 1×6) శుభారంభం చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 10.4 ఓవర్లలో 94 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే చావ్లా బౌలింగ్‌లో తొలుత ధావన్‌ ఎల్బీగా వెనుదిరిగాడు. స్వల్ప వ్యవధిలోనే పృథ్వీషా సైతం చావ్లా బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు.

ఓపెనర్లు పెవిలియన్‌ చేరాక రిషభ్‌ పంత్ ‌(37; 25 బంతుల్లో 6×4), కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (26; 22 బంతుల్లో 1×4) తమవంతు బ్యాటింగ్‌ చేశారు. చివర్లో సామ్‌కరన్‌ బౌలింగ్‌లో శ్రేయస్‌ వికెట్ల వెనక్కి షాట్‌ ఆడడంతో ధోనీ అమాంతం గాల్లోకి డైవ్‌ చేసి అద్భుత క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో దిల్లీ జట్టు చెన్నై ముందు 176 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చెన్నై బౌలర్లలో చావ్లా రెండు వికెట్లు తీయగా సామ్‌కరన్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు.