దుబాయ్: రాజస్తాన్ రాయల్స్ అభిమానులకు ఉర్రూతలూగించే వార్త. పర్ఫెక్ట్ అల్‌రౌండర్ లేక ఇబ్బందులు పడుతున్న స్మిత్ సేనకు ఊరటకలిగించే విషయం. సూపర్‌ఫామ్‌లో ఉన్న స్టార్ ఆల్‌రౌండర్, గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ హీరో, ఇంగ్లండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ ఈ మెగాటోర్నీలో పాల్గొనబోతున్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ఉన్న స్టోక్స్ ఈ రోజు క్రైస్ట్‌చర్చ్ నుంచి బయలుదేరి యూఏఈ చేరుకుంటారు. ఐసీసీ, బీసీసీఐ నిబంధనల ప్రకారం అతడు కొన్ని రోజులు క్వారంటైన్‌లో ఉంటాడు. మూడు సార్లు కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించుకున్న అనంతరం అన్నింటా నెగటీవ్ వస్తే జట్టుతో కలుస్తాడు.
ఇక ఈ స్టార్ ఐపీఎల్ ప్రారంభపు మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌లో ఉన్న అతడి తండ్రికి బ్రెయిన్ క్యాన్సర్ అని తేలడంతో ఇన్ని రోజులు అక్కడే ఉన్నాడు. ప్రస్తుతం స్టోక్స్ తండ్రి ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో ఐపీఎల్‌కు సన్నద్దమయ్యాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వారం రోజుల తర్వాత రాజస్తార్ జట్టులో స్టోక్స్‌ను చూడొచ్చు. ఇతడి రాకతో స్మిత్ సేనకు మరింత బలం చేకూరడం ఖాయం. ఎందుకుంటే టాపార్డర్‌లో బ్యాటింగ్ చేసే సత్తాకలగడంతో పాటు అవసరమైతే లోయరార్డర్‌లోనూ బ్యాటింగ్‌కు దిగి పరిస్థితులకు తగ్గట్టు హిట్టింగ్ చేయగలడు.
బౌలింగ్‌లనూ సత్తా చాటగాల స్టోక్స్.. మిడిల్ ఓవర్లలో అతడి బౌలింగ్ రాజస్తాన్‌కు ఎంతో ఉపయోగపడుతుంది. అటు బ్యాట్ ఇటు బంతితోనే కాకుండా ఫీల్డింగ్ లోనూ దిట్ట అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2018 ఆటగాళ్ల వేలంలో రాజస్తాన్ రాయల్స్ జట్టు స్టోక్స్‌ను ఏకంగా రూ.12.5 కోట్లకి కొనుగోలు చేసింది. ఇక 2017 నుంచి ఈ మెగాటోర్నీలో పాల్గొంటున్న స్టోక్స్ ఇప్పటివరకు 34 మ్యాచ్‌లాడి 132.01 స్ట్రైక్‌రేట్‌తో 635 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉండగా.. అత్యధిక స్కోరు 103. ఇక బౌలింగ్‌లోనూ 8.25 ఎకానమీతో 26 వికెట్లు పడగొట్టాడు.