దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020లో మాటల యుద్దం ప్రారంభమైంది. అయితే ఈ మాటల యద్దం మైదానంలో కాదు.. గ్రౌండ్ అవతల. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆల్‌రౌండర్ జిమ్మీ నీషమ్‌ను టార్గెట్ చేస్తూ టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా విమర్శల వర్షం కురిపిస్తున్న విషయం తెలసిందే. పంజాబ్ జట్టు కూర్పు సరిగా లేదని, తుది జట్టును ఎంపిక చేయడంలో సారథి కేఎల్ రాహుల్ పూర్తిగా విఫలం అవుతున్నాడని తప్పుపట్టారు. ముఖ్యంగా ముజీబ్ ఉర్ రెహ్మాన్‌ను పక్కకు పెట్టి నీషమ్‌ను తీసుకోవడం పట్ల రాహుల్‌ను ఏకిపారేస్తున్నాడు.
‘కింగ్స్ పంజాబ్ సరైన జట్టుతో ఆడటం లేదు. విదేశీ ఆటగాళ్ల కోటాలో ముజీబ్‌ను కాదని నీషమ్‌ను ఎంపిక చేయడం ఆశ్చర్యంగా ఉంది. ఇలా ముజీబ్‌ను పక్కకు పెడుతున్న జట్టు ఏదైనా ఉందంటే అది పంజాబ్ జట్టే. అటు పవర్ ప్లేలో ఇటు డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయగల సిద్దహస్తుడు కాదు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే అతడు మ్యాచ్ విన్నర్ కాదు. మరి అతడిని ఎందుకు తుది జట్టులోకి తీసుకొని ఆడిస్తున్నారు? మ్యాచ్ విన్నర్ కాని ఆటగాడిని(నీషమ్)ను ఆడించడం వల్ల పంజాబ్‌కు కలుగుతున్న లాభం ఏంటి?’ అంటూ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానల్ వేదికగా ప్రశ్నించాడు.
ఇక చోప్రా వ్యాఖ్యలపై నీషమ్ గట్టిగానే స్పందించాడు. ‘18.5 సగటు, 90 స్ట్రైక్‌రేట్‌తో చాలా మ్యాచ్‌లను గెలిపించలేం’ అని చోప్రాను ఉద్దేశిస్తూ అతడి ఇజ్జత్ తీశాడు నీషమ్. కాగా, ఆకాశ్ చోప్రా తన కెరీర్‌లో మొత్తం 21 టీ20లు ఆడి 18.5 యావరేజ్, 90 స్ట్రైక్ రేట్‌తో 334 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో ఆరు ఇన్నింగ్స్‌ల్లో 8.8 సగటు, 74.6 స్ట్రైక్‌రేట్‌తో 53 పరుగులు మాత్రమే చేశాడు. ఇదే విషయాన్ని గుర్తుచేస్తూ చోప్రాను ట్రోల్ చేశాడు.
‘నువ్వు చెప్పింది నిజమే ఫ్రెండ్. అందుకే ఏ జట్టు నన్ను తీసుకోలేదు. వేరే పని చేస్తుండటంతో నాకు డబ్బు వస్తుంది. నా విశ్లేషణలు, నా క్రికెట్ గణంకాలతో నీకు వచ్చే సమస్యేం లేదనుకుంటున్నా. మిగిలిన మ్యాచ్‌లోనైనా అద్భుతంగా రాణించాలని కోరుకుంటున్నా’అని చోప్రా సమాధానమచ్చిడు. అయితే ఓ సీనియర్ క్రికెటర్ గణాంకాలను ప్రస్తావిస్తూ నీషమ్ అలా అనడం అభిమానులకు నచ్చడం లేదు. చోప్రా వ్యాఖ్యలపై అనవసరంగా స్పందించకుండా తన ఆటతోనే బదులివ్వాలని సూచిస్తున్నారు.