ఆసీస్ బౌలర్ల‌ని ఉతికారేసిన జ‌డేజా.. తొలి టీ20 లో భార‌త్ ఘ‌న విజ‌యం

ఆసీస్ గ‌డ్డ‌పై వ‌న్డే సిరీస్ కోల్పోయిన భార‌త జ‌ట్టు టీ 20 సిరీస్ ద‌క్కించుకోవాల‌నే క‌సితో ఉంది. ఇందులో భాగంగా శుక్ర‌వారం కాన్ బెర్రా వేదిక‌గా జ‌రిగిన తొలి టీ 20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో త‌ల‌ప‌డింది. ఇందులో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు బౌలింగ్ ఎంచుకుంది. క‌ట్టుదిట్ట‌మైన బౌలింగ్‌తో భార‌త్ ని కాస్త కంట్రోల్ చేసిన‌ప్ప‌టికీ ఓపెనర్ కేఎల్ రాహుల్ (51: 40 బంతుల్లో 5×4, 1×6), రవీంద్ర జడేజా (44 నాటౌట్: 23 బంతుల్లో 5×4, 1×6) సమయోచిత ఇన్నింగ్స్ ఆడటంతో భార‌త్ 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 160 ప‌రుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో హెన్రిక్యూస్ మూడు వికెట్లు పడగొట్టగా.. మిచెల్ స్టార్క్ రెండు, ఆడమ్ జంపా, మిచెల్ స్వీప్ తలో వికెట్ తీశారు.

ఇక 161 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆసీస్ 50 ప‌రుగుల వ‌ర‌కు ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. ఫించ్ (35), షార్ట్ (34) అద్భుత భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. ఎప్పుడైతే జ‌డేజా స్థానంలో బ‌రిలోకి దిగిన చాహ‌ల్ ఎంట్రీ ఇచ్చాడో వికెట్ల ప‌త‌నం మొద‌లైంది. తొలి వికెట్‌గా ఫించ్ ఔట్ కావ‌డంతో, ఆ త‌ర్వాత స్మిత్‌(12) కూడా చాహ‌ల్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. అనంత‌రం మ్యాక్స్ వెల్‌(3), షార్ట్, వేడ్‌(7) , మిచెల్ స్టార్క్‌( 1) వెంట‌వెంట‌నే వెనుదిరిగారు. హెన్రిక్స్(30) , స్వెప్స‌న్‌( 12) కాస్త పోరాటం చేసిన ఫ‌లితం లేక‌పోయింది. మొత్తంగా ఆస్ట్రేలియా 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 150 ప‌రుగులు చేసింది. దీంతో భార‌త్ 11 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తిక‌ర అంశం చోటు చేసుకుంది. బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో ర‌వీంద్ర జ‌డేజా గాయ‌ప‌డ‌డంతో కాంకషన్ సబ్‌స్టిట్యూట్ రూపంలో చాహల్ గ్రౌండ్‌లోకి వ‌చ్చాడు. దీనిపై ఆస్ట్రేలియా చీఫ్ కోచ్ జస్టిన్ లాంగర్, కెప్టెన్ అరోన్ ఫించ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ మ్యాచ్ రిఫరీతో గొడవకి దిగారు. అయితే.. కాంకషన్ సబ్‌స్టిట్యూట్ నిబంధనల మేరకు చాహ‌ల్‌ని అనుమ‌తించిన‌ట్టు మ్యాచ్ రిఫ‌రీ పాల్ విల్స‌న్ తెలిపారు. బ్యాటింగ్‌లో జ‌డేజా అద‌ర‌గొట్ట‌గా, ఆయ‌న స్థానంలో గ్రౌండ్‌లోకి వ‌చ్చిన చాహ‌ల్ 4 ఓవ‌ర్ల‌లో 25 ప‌రుగులు ఇచ్చి 3 వికెట్స్ తీసాడు. భార‌త బౌల‌ర్స్‌లో చాహ‌ల్‌, న‌ట‌రాజ‌న్ మూడు వికెట్స్ తీయ‌గా, చాహ‌ర్ ఓ వికెట్ తీసుకున్నాడు. రెండో టీ 20 ఆరో తారీఖున జ‌ర‌గ‌నుంది.