ఇంగ్లాండ్ లో అడుగు పెట్టిన టీమిండియా.. ఫన్ మూడ్ లో పంత్, గిల్..!

ఐపీఎల్ 2025తో బిజీగా గడిపిన టీమిండియా క్రికెటర్లు ఇప్పుడు టెస్టు మూడ్‌లోకి మారారు. ఇంగ్లాండ్ గడ్డపై ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు శుక్రవారం ముంబయి నుంచి బయలుదేరి శనివారం ఉదయం లండన్‌లో అడుగుపెట్టింది. ఈ టూర్‌కు సంబంధించి బీసీసీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేస్తూ, భారత జట్టు లండన్ చేరిన విషయాన్ని వెల్లడించింది.

ఈ వీడియోలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభమన్ గిల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ వంటి ఆటగాళ్లంతా కనిపించారు. వీరికి లండన్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. కాగా జట్టులోని కొందరు ఆటగాళ్లు, ముఖ్యంగా పంత్, గిల్ ఫుల్ ఫన్ మూడ్ లో కనిపించారు.. మిగతా ఆటగాళ్లను ఆటపట్టించిన దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపించాయి. ఈ సరదా దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇక ఈ సిరీస్‌కు ప్రత్యేకత ఏమిటంటే… సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన తర్వాత తొలి కీలక టెస్టు సిరీస్ ఇదే. దీంతో కొత్త కెప్టెన్ శుభమన్ గిల్ నేతృత్వంలో టీమిండియా ఎలా రాణించబోతుందనేది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ఐదు టెస్టుల సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభంకానుంది. ఇంగ్లాండ్ గడ్డపై టెస్టుల్లో సాధారణంగా భారత్ కంటే స్వదేశ జట్టే పైచేయి సాధించిన సందర్భాలే ఎక్కువగా ఉన్నా… ఈసారి యువజోషంతో భారత్ మెరుగైన ప్రదర్శన ఇవ్వబోతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.