ధోనిని చెన్నై జట్టు నుంచి తప్పించడం బెటర్.. మాజీ క్రికెట‌ర్ సంచ‌ల‌న కామెంట్స్

మహేంద్ర సింగ్ ధోని..భారత క్రికెట్ హిస్టరీలో చెరిగిపోని, ఎదురులేని పేరు. నిశ్శబ్దంగా వచ్చి ఇండియాకు అరుదైన విజయాలు అందించాడు మహీంద్రుడు. ఇటీవలే మహీ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి ఫ్యాన్స్‌కు బాధను మిగిల్చాడు. కాగా ఐపీఎల్‌‌లో మాత్రం చెన్నై సూపర్​కింగ్స్​ రథసారథిగా జట్టును ముందుకు తీసుకెళ్తున్నాడు. అయితే 2020 సీజన్‌లో మాత్రం చెన్నైజట్టుతో పాటు ధోని కూడా తీవ్రంగా విఫలమయ్యారు. చివరిలో తేరుకున్నప్పటికీ..అప్పటికే జరగాల్సి డ్యామేజ్ జరిగిపోయింది. దీంతో ధోనిపై కొందరు విమర్శలు చేశారు. అతడిని జట్టు కెప్టెన్ బాధ్యతల నుంచి తొలగించాలని సూచించారు. ఆ కోవలోనే తాజాగా చెన్నై సూపర్​కింగ్స్​ సారథి ధోనీని ఆ జట్టు ఫ్రాంచైజీ వదిలేసుకోవాలని కామెంటేటర్​, మాజీ క్రికెటర్ ఆకాశ్​ చోప్రా సంచలన కామెంట్స్ చేశాడు. జట్టుకు మహీ అవసరం ఉందనిపిస్తే వచ్చే ఐపీఎల్​ కోసం జరిగే వేలంపాటలో మళ్లీ కొనుగోలు చేసుకోవాలని సూచించాడు.

“చెన్నై జట్టును ప్రక్షాలన చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. సీనియర్​ ప్లేయర్స్‌పై ఫోకస్ తగ్గించి, యువ ఆటగాళ్లను ఎంకరేజ్ చేయడం మంచిది. ఓ వాహనం గ్యారేజ్​ షెడ్‌కు వెళ్లినప్పుడు..దానికి పైపైన రిపేర్లు చేయకుండా…చెడిపాయిన వాటిని తొలిగించి..కొత్తగా మన్నికైన వాటిని అమర్చాలి. అప్పుడే అది సమర్థవంతంగా ముందుకు వెళ్తుంది. అలానే చెన్నై జట్టులో కొన్ని రిపేర్లు చేయాలి. ఫ్రాంచైజీని అంటి పెట్టుకున్న ధోనీ(రూ.15 కోట్లు), డుప్లెసిస్​(12.5), జడేజా(8)లకు అంత భారీ మొత్తం చెల్లించడం కరెక్ట్ కాదు. ఆ డబ్బుతో ఎక్కువమంది యువ ఆటగాళ్లను తీపుకోవచ్చు. మహీ విషయానికొస్తే అతడిని వదిలేయండి. ఎందుకంటే వచ్చే వేలంపాటలో అతడిని కొనుగోలు చేస్తే మూడేళ్ల పాటు ఫ్రాంచైజీతోనే ఉంచుకోవాల్సి వస్తుంది. కానీ అతడు మూడేళ్ల పాటు మీతో ఉండి సర్వీసులు అందించగలడా అన్నది ప్రధానమైన విషయం. అందుకే ప్రస్తుతానికి వదిలేసి…. జట్టుకు అతడి అవసరం తప్పదని భావిస్తే రైట్​ టు మ్యాచ్​ పద్ధతి ద్వారా కొనుగోలు చేయండి” అని ఆకాశ్​ చోప్రా అభిప్రాయపడ్డాడు.

ఈ ఐపీఎల్​లో చెన్నై జట్టు.. లీగ్​ చరిత్రలో తొలిసారిగా ప్లే ఆఫ్స్​కు అర్హత సాధించలేకపోయింది. దీంతో వచ్చే ఐపీఎల్​ కోసం సీఎస్కేలో మార్పులు అవసరమని పలువురు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ధోని మాత్రం వచ్చే ఐపీఎల్‌లో తాను బరిలోకి దిగుతున్నానని ఇటీవల స్పష్టం చేశాడు.