Gautam Gambhir: జట్టును వదిలి ఇండియాకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. అసలు ఏమయ్యింది..?

టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ ఆకస్మికంగా భారత జట్టును వదిలి.. ఇంగ్లాండ్ టూర్‌ నుంచి వెనుదిరిగారు. జూన్ 20 నుంచి ప్రారంభమయ్యే భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌కు ముందు కోచ్ దేశానికి తిరిగి రావడం అభిమానుల్లో అనేక ఊహాగానాలకు తావిచ్చింది. నిజానికి తాజా సమాచారం ప్రకారం, గంభీర్ తల్లి శీమా గంభీర్ తీవ్ర అస్వస్థతకు గురికావడం వల్లనే అతను టూర్‌ను మధ్యలో వదిలి ఇండియాకు బయలుదేరినట్లు తెలుస్తోంది. జూన్ 11న గంభీర్ తల్లికి గుండెపోటు వచ్చినట్టు కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. ఆమె ఆరోగ్యం విషమించడంతో గంభీర్ వెంటనే దేశానికి చేరుకున్నారు.

అయితే అతను తిరిగి జూన్ 17నాటికి మళ్లీ జట్టుతో కలవనున్నట్లు సమాచారం. అందువల్ల, జూన్ 20న ప్రారంభమయ్యే తొలి టెస్టు ముందు గంభీర్ టీమ్‌ ఇండియాతో తిరిగి చేర్చుకోనున్నాడు. ఇటీవలే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టెస్టులకు వీడ్కోలు పలకడంతో భారత జట్టు కొత్త నేతృత్వంతో బరిలోకి దిగుతోంది. యువ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్‌గా రిషబ్ పంత్ జట్టును నడిపించనున్నారు. 2007 తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలన్న లక్ష్యంతో యువ భారత జట్టు భారీ ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది.

ఈ టెస్టు సిరీస్ మొత్తం ఐదు మ్యాచ్‌లతో జరుగనుండగా, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025–27 భాగంగా పరిగణించనున్నారు. ఈ సిరీస్‌కు టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీ అనే ప్రత్యేక పేరు కూడా పెట్టారు. జట్టు ఇప్పటికే ఇంగ్లాండ్‌కు చేరుకుని ప్రాక్టీస్ ప్రారంభించింది. తొలి మ్యాచ్ జూన్ 20న లీడ్స్‌లో జరగనుంది. గంభీర్ తన వ్యక్తిగత బాధ్యతను పూర్తి చేసి తిరిగి జట్టుతో కలిసే అవకాశం ఉండటం టీమ్‌ ఇండియాకు ఊరటనిచ్చే విషయం.