IPL 2020: ఊతప్పను ఉతికారేస్తున్నారు.. శాంసన్‌ను మెచ్చుకుంటున్నారు

దుబాయ్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో భాగంగా బుధవారం దుబాయ్‌ వేదికగా దినేశ్‌ కార్తీక్‌ సారథ్యంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో రాజస్తాన్‌ రాయల్స్‌ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. అయితే రాజస్తాన్‌ ఆటగాడు, సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ రాబిన్ ఊతప్ప ఆరంభంలోనే సులువైన క్యాచ్‌ని జారవిడిచాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన జయదేవ్ ఉనద్కత్ బౌలింగ్‌లో ఐదో బంతిని మిడాన్ దిశగా సునీల్ నరైన్ ఆడాడు. కానీ బంతి అతను ఆశించిన విధంగా కనెక్ట్ కాకపోవడంతో అది నేరుగా ఫీల్డర్ ఊతప్ప చేతుల్లోకి వెళ్లింది. అయితే ఆ సులువైన క్యాచ్‌ను ఈ సీనియర్‌ ఆటగాడు నేలపాలు చేశాడు. దీంతో నెటజన్లు ఊతప్పను సోషల్‌ మీడియా వేదికగా ఓ ఆటాడుకుంటున్నారు.

ఇక ఇదే ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్‌ వేసిన టామ్‌ కరన్‌ బౌలింగ్‌లో చివరి బంతిని ప్యాట్‌ కమిన్స్‌ భారీ షాట్‌కు ఆడే ప్రయత్నం చేశాడు. అయితే ఆ షాట్‌ మిస్‌ఫైర్‌ కావడంతో బంతి గాల్లోకి లేచింది. మిడ్‌వికెట్‌ దిశలో అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న శాంసన్‌ తొలుత ఆ బంతిని తక్కువ అంచనా వేశాడు. అయితే త్వరగా కోలుకొని కమిన్స్‌ ఇచ్చిన క్యాచ్‌ను రెండు చేతులా అందుకున్నాడు. క్యాచ్‌ అందుకునే క్రమంలో అతడు వెనక్కి డైవ్‌ చేసి ఎవరూ ఊహించన విధంగా క్యాచ్‌ అందుకొని ఔరా అనిపించాడు. శాంసన్‌ అందుకున్న క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇక ఐపీఎల్‌తో తన బ్యాటింగ్‌తోనే కాకుండా ఫీల్డింగ్‌ తోనూ అదరగొడుతున్న శాంసన్‌పై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.