దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020లో భాగంగా రెండు వరుస విజయాలతో సన్‌రైజర్స్ హైదరాబాద్ మంచి జోరుమీదుంది. శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో గెలిచినప్పటికీ ఆరెంజ్ ఆర్మీకి పూర్తి స్థాయిలో ఆనందం దక్కలేదు. ఎందుకుంటే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ గాయపడ్డాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్ రెండో బంతిని వేసే క్రమంలో భువీ తొడకండరాల నొప్పితో ఇబ్బంది పడ్డాడు. అయినా మూడుసార్లు బౌలింగ్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ నొప్పి భరించలేక చివరికి మైదానాన్ని వీడాడు. దీంతో ఆ ఓవర్‌ను మరో పేసర్ ఖలీల్ అహ్మద్ పూర్తి చేశాడు.
భువనేశ్వర్ కుమార్‌ని గత కొంతకాలంగా తొడ కండరాల గాయం వేధిస్తోంది. గత ఏడాది చివర్లో ఇలానే గాయపడిన భువీ.. టీమిండియాకి దూరమయ్యాడు. ఒక ఫాస్ట్ బౌలర్ తొడ కండరాల గాయం నుంచి వేగంగా కోలుకుని ఫిట్‌నెస్ సాధించడం చాలా కష్టం. కాబట్టి.. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో భువనేశ్వర్ ఆడటం అనుమానమే. ఇక భువీ గాయంపై ఇప్పటికైతే ఎలాంటి స్పష్టత రాలేదని, ఫిజియోతో మాట్లాడాక పూర్తి వివరాలు చెబుతామని సన్‌రైజర్స్ సారథి వార్నర్ మ్యాచ్ అనంతరం తెలిపాడు. సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో 3.1ఓవర్లు వేసిన భువీ.. 6.30 ఎకానమీతో 20 పరుగులిచ్చాడు. ఒక వికెట్ కూడా దక్కించుకున్నాడు.
ఇక సన్‌రైజర్స్‌కు ఈ సీజన్‌లో గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయపడటంతో టోర్నీకే దూరమయ్యాడు. కేన్ విలియమ్సన్, మనీశ్ పాండే గాయాలతో సతమతమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో స్టార్ బౌలర్ గాయపడటం అటు టీమ్‌మేనేజ్‌మెంట్‌ను ఇటు సన్‌రైజర్స్ అభిమానులను కలవరానికి గురిచేస్తోంది.