దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ 13కు మరో ఆటగాడు దూరమయ్యాడు. గాయం కారణంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఫాస్ట్ బౌలర్ అలీ ఖాన్ గాయం కారణంగా ఈ మెగా టోర్నీకి పూర్తిగా దూరమయ్యాడు. ఒక్క మ్యాచ్ ఆడకుండానే ఈ క్యాష్ రిచ్ లీగ్ టోర్నీకి దూరమయ్యాడని ఐపీఎల్ అధికారికంగా ప్రకటించింది. అయితే అతడికి ఎలా గాయం అయింది, గాయం తీవ్రతపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అమెరికా నుంచి తొలిసారిగా ఐపీఎల్‌లో చోటు దక్కించుకున్న అలీఖాన్ ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే టోర్నీకి పూర్తిగా దూరమవ్వడం ఐపీఎల్ ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరుస్తోంది.
ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభానికి ముందు ఇంగ్లండ్ బౌలర్ హ్యారీ గుర్నీ గాయపడటంతో అతడి స్థానంలో అమెరికాకు చెందిన అలీని ఎంపిక చేసినట్లు కేకేఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఐపీఎల్ వంటి క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగుపెట్టిన తొలి అమెరికన్ ఆటగాడిగా ఘనతకెక్కాడు. కుడి చేతి వాటం ఫాస్ట్ బౌలర్ అయిన అలీ పాకిస్థాన్‌లో పుట్టి పెరిగాడు. 18 ఏళ్ల వయసులో కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లి స్థిరపడిపోయాడు. ఆ తర్వాత అమెరికన్ క్రికెట్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్ ఆడనప్పటికీ అనేక టీ20 లీగ్‌లు ఆడిన అనుభవం అలీకి ఉంది. కరేబియన్ ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్, కెనడా, బంగ్లాదేశ్ లీగుల్లో పాల్గొని ఆకట్టుకున్న అలీ తనకంటూ ప్రత్యేక అభిమానులను సొంతం చేసుకున్నాడు.