డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో జరిగిన ప్రారంభపు మ్యాచ్‌లో విజయం అందుకున్న చెన్నై సూపర్‌కింగ్స్ మంచి జోరుమీద కనిపించింది. అయితే అదే జోరును కొనసాగించని ధోని సేన వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయి ఐపీఎల్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. కాగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించి రేసులోకి తిరిగొచ్చింది. అయితే ఆ ఆనందం సీఎస్‌కే అభిమానులకు ఎంతో సేపు నిలువలేదు. ఎందుకుంటే చెన్నై స్టార్ బ్యాట్స్‌మన్ ఫాఫ్ డుప్లెసిస్ గాయపడ్డట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ సీజన్‌లో సీఎస్‌కే తరుపున నిలకడగా రాణిస్తున్న ఏకైక బ్యాట్స్‌మన్ డుప్లెసిస్ అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ధోని సేన ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన చేసిన డుప్లెసిస్ 282 పరుగులు చేశాడు. అయితే పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో డుప్లెసిస్ గాయపడినట్లు అనధికారిక సమాచారం. మ్యాచ్ అనంతరం సీఎస్‌కే విడుదల చేసిన ఓ వీడియోలో అతడు కుంటుకుంటూ నడిపించడాన్ని అభిమానులు గుర్తించారు. అంతేకాకుండా నడవడానికి ఇబ్బంది పడ్డట్టు కూడా కనిపించింది.
దీంతో డుప్లెసిస్ గాయపడ్డట్టు అభిమానులు ఫిక్సయ్యారు. అయితే ఈ విషయంపై సీఎస్‌కే ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒకవేళ డుప్లెసిస్ గాయం తీవ్రమైతే ఆ ప్రభావం ధోని సేనపై భారీగానే ఉంటుంది. ఇక బుధవారం దినేశ్ కార్తీక్ సారథ్యంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సీఎస్‌కే తలపడనుంది. మరి కేకేఆర్‌తో జరగబోయే మ్యాచ్‌లో డుప్లెసిస్ ఆడతాడో లేదో చూడాలి.