ఐపీయల్ : చెన్నైగెలిచి… పోతు పోతూ పంజాబ్ ని కూడా తీసుకుని పోయింది

Chennai Super Kings won by 9 wickets on punjab

Nov-01-2020,IPL : ఈ సీజన్లో ఇప్పటివరకు ఒకే ఒక్క జట్టు మాత్రమే ప్లే ఆఫ్స్ లో చోటు ఖాయం చేసుకుంది . పోరు రసవత్తరంగా సాగుతుంది.ఐపీయల్ చరిత్రలో చెన్నై జట్టు ఒక స్థిరత్వంతో కూడిన ఆటతీరుతో ప్రేక్షకుల మనసులు దోచుకుంది, ఏ జట్టు కి లేనంతగా చెన్నై జట్టు కి ప్రేక్షకుల అభిమానం ఉంది. ఇప్పటివరకు ఆ జట్టు ప్రతి సీజన్లో ప్లే ఆఫ్స్ లో ఉంది . కానీ ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ కి చేరకుండానే ఇంటికి పయనమైంది. సీజన్‌ని విజయంతో ఆరంభించిన చెన్నై సూపర్ కింగ్స్.. గెలుపుతోనే తన ప్రయాణాన్ని ముగించింది.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో అబుదాబి వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 154 పరుగుల లక్ష్యాన్ని.. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (62 నాటౌట్: 49 బంతుల్లో 6×4, 1×6) అజేయ హాఫ్ సెంచరీ బాదడంతో మరో 7 బంతులు మిగిలి ఉండగానే 154/1తో చెన్నై అలవోక విజయాన్ని అందుకుంది. ఇప్పటికే చెన్నై టీమ్ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించగా.. ఈరోజు ఓటమితో పంజాబ్ కూడా ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుని ఇంటి బాట పట్టింది. రెండు జట్లకీ తాజా సీజన్‌లో ఇదే ఆఖరి మ్యాచ్. 14 మ్యాచ్‌లాడిన పంజాబ్ ఎనిమిదో ఓటమితో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పరిమితమవగా.. చెన్నై సూపర్ కింగ్స్ 14 మ్యాచ్‌లకిగానూ ఆరో విజయంతో ఏడో స్థానంతో సరిపెట్టింది.

Chennai Super Kings won by 9 wickets on punjab
Chennai Super Kings won by 9 wickets

మ్యాచ్‌లో 154 పరుగుల ఛేదనని చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్ (48: 34 బంతుల్లో 4×4, 2×6) దూకుడుగా ఆరంభించారు. తొలి వికెట్‌కి 9.5 ఓవర్లలోనే 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీ.. సగం ఛేదనని పూర్తి చేసేసింది. అయితే.. స్వీప్ ఆడే ప్రయత్నంలో డుప్లెసిస్ ఔటవగా.. అనంతరం వచ్చిన అంబటి రాయుడు (30 నాటౌట్: 30 బంతుల్లో 2×4)తో కలిసి సమయోచితంగా ఆడిన రుతురాజ్ గైక్వాడ్.. 19వ ఓవర్‌లోనే గెలుపు లాంఛనాన్ని పూర్తి చేసేశాడు. పంజాబ్ కెప్టెన్/ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్.. అంబటి రాయుడి క్యాచ్, స్టంపౌట్‌ని వదిలేయగా.. మన్‌దీప్ సింగ్ వివాదాస్పద రీతిలో రుతురాజ్ గైక్వాడ్ క్యాచ్‌ని నేలపాలు చేశాడు. దాంతో.. పంజాబ్‌కి ఈ జోడీ మరో ఛాన్స్ ఇవ్వలేదు.

ప్లేఆఫ్ రేసు నుంచి ఇప్పటికే నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్.. మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో.. కెప్టెన్ కేఎల్ రాహుల్ (29: 27 బంతుల్లో 3×4, 1×6)తో కలిసి పంజాబ్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన మయాంక్ అగర్వాల్ (26: 15 బంతుల్లో 5×4) తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడేశాడు. దాంతో.. తొలి వికెట్‌కి ఈ జోడీ 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. కానీ ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో మయాంక్‌ని క్లీన్ బౌల్డ్ చేసిన లుంగి ఎంగిడి.. 9వ ఓవర్‌లో కేఎల్ రాహుల్‌ని కూడా బోల్తా కొట్టించేశాడు. అనంతరం వచ్చిన క్రిస్‌గేల్ (12: 19 బంతుల్లో) ఇమ్రాన్ తాహిర్‌కి దొరికిపోగా.. నికోలస్ పూరన్ (2: 6 బంతుల్లో) తేలిపోయాడు. దాంతో.. మన్‌దీప్ సింగ్ (14: 15 బంతుల్లో 1×5)తో కలిసి కాసేపు పంజాబ్ స్కోరు బోర్డుని నడిపించిన దీపక్ హుడా (62: 30 బంతుల్లో 3×4, 4×6).. స్లాగ్ ఓవర్లలో భారీ షాట్లతో చెలరేగిపోయాడు. ఒక ఎండ్‌లో మన్‌దీప్‌, నషీమ్ (2) ఔటైనా వెనక్కి తగ్గని దీపక్ హుడా.. లుంగి ఎంగిడి వేసిన ఓవర్‌‌లో రెండు సిక్సర్లు బాదేశాడు. ఆఖరి ఓవర్‌లోనూ ఒక సిక్స్, ఫోర్ బాదిన హుడా ఐపీఎల్‌ కెరీర్‌లో 48 ఇన్నింగ్స్‌ల తర్వాత హాఫ్ సెంచరీ మార్క్‌ని అందుకోవడంతో పాటు.. ఐపీఎల్‌లో కెరీర్‌ బెస్ట్ స్కోరుని కూడా సాధించాడు. చెన్నై బౌలర్లలో లుంగి ఎంగిడి మూడు వికెట్లు పడగొట్టగా.. శార్ధూల్ ఠాకూర్, ఇమ్రాన్ తాహిర్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు.