IPL-2020 : ఎట్టకేలకు గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ … పోరాడి ఒడిన సన్ రైజర్స్

csk vs srh

ఐపీఎల్ 2020 సీజన్‌‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకి మళ్లీ గెలుపు రుచి చూసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో దుబాయ్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో బౌలర్లు సమష్టిగా రాణించడంతో చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై టీమ్ షేన్ వాట్సన్ (42: 38 బంతుల్లో 1×4, 3×6), అంబటి రాయుడు (41: 34 బంతుల్లో 3×4, 2×6) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడటంతో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో కేన్ విలియమ్సన్ (57: 39 బంతుల్లో 7×6) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోవడంతో హైదరాబాద్ 147/8కే పరిమితమైంది. తాజా సీజన్‌లో 8వ మ్యాచ్ ఆడిన చెన్నైకి ఇది మూడో గెలుపుకాగా.. హైదరాబాద్‌కి ఐదో ఓటమి. అక్టోబరు 2న దుబాయ్ వేదికగానే చెన్నైని 7 పరుగుల తేడాతో హైదరాబాద్ ఓడించగా.. తాజాగా చెన్నై టీమ్ బదులు తీర్చుకున్నట్లయింది.

csk vs srh
csk beat srh by 20 runs

చెన్నై ఓపెనర్ల విషయంలో ఊహించని మార్పు చేసింది. వాట్సన్ స్థానంలో సామ్‌ కరన్‌‌ను ఓపెనర్‌గా పంపింది. ఈ సారి డుప్లెసిస్‌ (0) నిరాశపరిచాడు. సందీప్‌ శర్మ వేసిన 2.1వ బంతికి బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఖలీల్‌ అహ్మద్‌ వేసిన ఓవర్లో సామ్‌ కరన్‌ (31) రెచ్చిపోయాడు. మొదటి రెండు బంతులను బౌండరీకి తరలించగా, మూడో బంతిని ఆరో బంతిని భారీ సిక్సర్లుగా మలిచాడు. ఈ ఓవర్లో 22 పరుగులు వచ్చాయి. దాటిగా ఆడుతున్న అతనిని సందీప్‌ శర్మ సూపర్ బంతితో క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత వాట్సన్,అంబటి రాయిడు(41) నిలకడ ఆడుతూ స్కోర్ వేగాన్ని పెంచారు. ఈ క్రమంలో ఖలీల్ ఆహ్మద్ బౌలింగ్‌లో భారీ షాట్ యత్నించి రాయిడు ఔటయ్యాడు. చివరకు ధోనీ(21),జడేజా(25) దాటిగా ఆడి సీఎస్‌కే స్కోరు 167 పరుగులు చేశారు .

168 పరుగుల ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (9: 13 బంతుల్లో), జానీ బెయిర్‌స్టో (23: 24 బంతుల్లో 2×4) నిరాశపరచగా.. మూడో స్థానంలో వచ్చిన మనీశ్ పాండే (4) లేని పరుగు కోసం ప్రయత్నిస్తూ రనౌటయ్యాడు. దాంతో.. టీమ్‌పై ఒత్తిడి పెరిగిపోగా.. కేన్ విలియమ్సన్ ఒక ఎండ్‌లో క్రీజులో నిలిచాడు. కానీ.. అతను వేగంగా ఆడలేకపోవడంతో బంతులు, పరుగుల మధ్య అంతరం భారీగా పెరిగిపోయింది. మిడిల్ ఓవర్లలో ప్రియమ్ గార్గ్ (16: 18 బంతుల్లో 1×4).. ఆఖర్లో విజయ్ శంకర్ (12: 7 బంతుల్లో 1×4) ఔటవడం కూడా హైదరాబాద్‌ని దెబ్బతీసింది. దాంతో.. తప్పనిసరి పరిస్థితిల్లో హిట్టింగ్ చేసిన విలియమ్సన్ కూడా జట్టు స్కోరు 126 వద్ద వికెట్ చేజార్చుకోగా.. ఆఖర్లో రషీద్ ఖాన్ (14: 8 బంతుల్లో 1×4, 1×6) దూకుడు సన్‌రైజర్స్ ఓటమి అంతరాన్ని తగ్గించగలిగిందంతే. చెన్నై బౌలర్లలో కర్ణ్ శర్మ, డ్వేన్ బ్రావో చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. శామ్ కరన్, రవీంద్ర జడేజా, శార్ధూల్ ఠాకూర్ తలో వికెట్ తీశారు.