సాయాజీ షిండే సినిమాలలో రాకముందు ఈ పని చేసేవాడా?

సాయాజీ షిండే ఒక భారతీయ నటుడు. ఎక్కువగా తెలుగు సినిమాలలో నటించాడు. ఈయన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో జన్మించాడు. వీరిది ఒక సాధారణ రైతు కుటుంబం. డిగ్రీ చదువుతున్న సమయంలో మహారాష్ట్ర గవర్నమెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో నైట్ వాచ్ మెన్ గా చేసేవాడు.

నెలకు జీతం 165 రూపాయలు. తర్వాత విద్యాభ్యాసం పూర్తి చేసి, బ్యాంకు ఉద్యోగం చేసేవారు. ఉద్యోగం చేస్తున్న కూడా మనసంతా నటన పైనే ఉన్నందున ఒక పెద్దాయన సలహాతో వ్యాయామం, యోగ అలవాటు చేసుకుని దేహదారుఢ్యం పెంచుకున్నాడు. నటన గురించి చాలామందిని అడిగి తెలుసుకున్నాడు. నటనకు సంబంధించిన పుస్తకాలు ఎన్నో చదివాడు.

భరతముని నాట్య శాస్త్రాన్ని పూర్తిగా చదివాడు. అభినయ సాధక్ లాంటి మరాఠీ పుస్తకాలను కూడా చదివి నటనపై అవగాహన పెంచుకున్నాడు. ధార్మియా అనే నాటకంలో షిండే పోషించిన హిజ్రా పాత్ర ఎంతో గుర్తింపు తీసుకువచ్చింది. తన నటనకు స్టేట్ అవార్డు కూడా వచ్చింది. చాలామంది షిండే ను నిజమైన హిజ్రా అని అనుకున్నారు. ఇతను ప్రముఖుల దృష్టిలో పడి మరాఠీలో వరుస అవకాశాలతో అనేక చిత్రాలలో నటించడం జరిగింది.

2000 సంవత్సరంలో తమిళంలో వచ్చిన భారతి సినిమా ద్వారా దక్షిణాదికి సినీ పరిశ్రమకు చేరువయ్యాడు. 2001లో సూరి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఠాగూర్ సినిమాలో బద్రి నారాయణ గా, వీడే సినిమాలో బైరాగి నాయుడుగా నటించి మంచి గుర్తింపు పొంది ఆ తర్వాత ఎక్కువగా తెలుగు సినిమాలలో నటించడం జరిగింది.

గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షిండే తనకు డబ్బు సంపాదించాలని, పెద్ద స్టార్ కావాలని ఉండేది కాదని తన నటనకు మంచి గుర్తింపు వస్తే చాలు. తనకు నటించాలనే కోరిక తప్ప ఇంక వేరే పేరు, ప్రఖ్యాతలు పెద్దగా అవసరం లేదని తన నటన వల్ల చాలా సంతోషంగా ఉన్నానని చెప్పడం జరిగింది.