Rahul Tour : కాంగ్రెస్ భావి ప్రధానిగా చెప్పబడే రాహుల్ గాంధీ, తెలంగాణలో పర్యటించారు. వరంగల్‌లో భారీ బహిరంగ సభ, హైద్రాబాద్‌లో కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశం.. వెరసి, కనీ వినీ ఎరుగని హంగామా అయితే నడిచింది. జాతీయ కాంగ్రెస్‌కి పెద్ద దిక్కు అయిన సోనియాగాంధీ తనయుడు కదా, రాహుల్ రాకతో ఆ మాత్రం జోష్ తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో వుండడం సహజమే.
ఇంతకీ, రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన వల్ల తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏం లాభం.? నాయకుల మధ్య కొట్లాటలు ఆగుతాయా.? గొడవలు సద్దుమణిగి అంతా కలిసి మెలిసి పని చేస్తారా.? వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా.? లేదా.? అన్నది వేరే చర్చ. అసలంటూ, ఇప్పుడు రాహుల్ వెంట కనిపించిన నేతల్లో ఎంతమంది కాంగ్రెస్ నేతలు, వచ్చే ఎన్నికల వరకూ కాంగ్రెస్ పార్టీలో వుంటారు.?
కాంగ్రెస్ పార్టీ వ్యవహారం మూడు కాళ్ళ కుర్చీలా వుంటుంది. ఓ కాలు ఎవరో ఒకరు ఎప్పుడూ లాగేస్తూనే వుంటారు. దాన్ని కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యమని గొప్పగా చెప్పుకుంటుంటారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా వున్నా, రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఆ పదవిలోకి వచ్చినా.. ఈ ఘనమైన అంతర్గత ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీని చంపేస్తూనే వుంది.
కాంగ్రెస్ పార్టీకి వేరే శతృవులు అవసరం లేదు.. పార్టీలోనే శతృవులుంటారు.. పైగా, పార్టీని నాశనం చేసి, పార్టీ బాగు కోసమేనంటారు. రాహుల్ వచ్చి వెళ్ళడం.. ఆ తర్వాత షరామామూలుగానే కొట్లాట.! రాహుల్ వచ్చి ఏం ప్రయోజనం.?