వైఎస్సార్టీపీని ఎన్జీవోగా పోల్చిన రేవంత్ రెడ్డి

వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఎన్జీవోగా పోల్చారు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. ‘వైఎస్ షర్మిలకి సోదరుడితో ఆస్థి పంపకాల తగాదా కారణంగా సమస్యలున్నట్టున్నాయనీ, ఆ బాధలో రాజకీయ పార్టీని పెట్టానుకుంటున్న షర్మిల, కేవలం ఎన్జీవో సంస్థని నడుపుతున్నట్లుగా తాను భావిస్తున్నాననీ’ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణతో షర్మిలకు సంబంధం లేదని తేల్చిన రేవంత్ రెడ్డి, ఆస్తి పంపకాలకు సంబంధించి వివాదాలుంటే, కుల పెద్దలో మత పెద్దలో ఆ సమస్యల్ని పరిష్కరించగలరంటూ షర్మిలకు ఉచిత సలహా ఇచ్చారు రేవంత్ రెడ్డి. కాగా, ఓ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డిపై తాజాగా షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. కేసీయార్ చేతిలో రేవంత్ రెడ్డి పిలక వుందనీ, పిలక లాగెయ్యడం కాదు.. మెడకాయని కేసీయార్ అవసరమైతే లాగేయగలరని షర్మిల వ్యాఖ్యానించారు.

షర్మిల వ్యాఖ్యల పట్ల రేవంత్ రెడ్డి పై విధంగా స్పందించారు. కాగా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు ప్రస్తావిస్తూ, వైఎస్సార్ అనే వ్యక్తి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అనీ, రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని వైఎస్ అనుకునేవారనీ, వైఎస్సార్ చివరి కోరిక కూడా రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమేననీ, తండ్రి ఆశయాల్ని నెరవేర్చేందుకు షర్మిల, జగన్.. రాహుల్‌ గాంధీకి మద్దతివ్వాలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. వైఎస్సార్ మరణం తర్వాత వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలను కాంగ్రెస్ పార్టీ ఎలా ఇబ్బంది పెట్టిందీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పులివెందుల ఉప ఎన్నికలో వైఎస్ విజయమ్మకు పోటీగా వైఎస్ వివేకానందరెడ్డిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపిన విషయాన్ని ఎలా మర్చిపోగలరెవరైనా.? షర్మిలది ఎన్జీవోనో, కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చే బలమైన రాజకీయ పార్టీనో.. ఎన్నికల్లో తేలిపోతుంది.