ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అలాగే ఉమ్మడి పశ్చిమగోదారి జిల్లాలో కాపు సామాజిక వర్గం ప్రభావం చాలా చాలా ఎక్కువ.. రాజకీయ కోణంలో చూసుకున్నప్పుడు. ఏ రాజకీయ పార్టీకి కాపు సామాజిక వర్గంలో మెజార్టీ మద్దతు లభిస్తుందో, ఆ పార్టీనే అధికారంలోకి వస్తుంటుంది. అందుకే, కాపు సామాజిక వర్గంలో అనైక్యతను రాజేసి, రాజకీయ పార్టీలు రాజకీయ లబ్ది పొందుతుంటాయ్.
2014 ఎన్నికల్లో టీడీపీకి, 2019 ఎన్నికల్లో వైసీపీకి కాపు సామాజిక వర్గం అండగా నిలబడింది. మరి, 2024 ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు ఎలా వుండబోతున్నాయ్.? నిజానికి, కాపు సామాజిక వర్గం, రాజ్యాధికారం దిశగా సమాలోచనలు చేస్తోంది. కాపు సామాజిక వర్గ ప్రముఖులు, పార్టీలకతీతంగా ఒక్కతాటిపైకి వస్తున్నారు.
ప్రస్తుతానికైతే వైసీపీ కాపు నేతలు వైసీపీ మీదా, టీడీపీ కాపు నేతలు టీడీపీపైనా అభిమానంతోనే వున్నారు. జనసేన సంగతి సరే సరి. అయితే, ఈక్వేషన్స్ క్రమంగా మారుతున్నాయి. ‘కాపు సామాజిక వర్గానికి రాజ్యాధికారం కావాలి..’ అనే భావన కాపు యువతలో స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో అధికార వైసీపీ అప్రమత్తమయ్యింది. కోనసీమ జిల్లాలో అంబేద్కర్ పేరు రగడ సహా, అనేక వ్యవహారాల్లో ఈ కాపు సామాజిక వర్గంపై ఒకింత బురద చల్లే ప్రయత్నం అధికార వైసీపీ నుంచి జరిగిన మాట వాస్తవం. దాంతో, ఆ సామాజిక వర్గంలోని యువత అంతా అధికార పార్టీపై గుర్రుగా వుంది.
మరోపక్క, వైసీపీలో గతంలో పదవులు పొంది, వాటికి కొనసాగింపుని పొందలేకపోయిన నాయకులు, జనసేన వైపుగా చూస్తున్నారు. అయితే, అలాంటి నాయకుల్ని దగ్గరకు చేరనివ్వకూడదనే భావనలో జనసేన వుందట. ఆయా నియోజకవర్గాల్లో క్లీన్ ఇమేజ్ వున్న ‘కాపు’ నాయకుల మీద జనసేన ఫోకస్ పెట్టడంపై, అధికార వైసీపీకి ఖచ్చితమైన సమాచారం అందినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో అసంతృప్త కాపు నేతల్ని బుజ్జగించేందుకు వైసీపీ అధినాయకత్వం ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. త్వరలోనే ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కాపు సామాజిక వర్గ నేతలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేకంగా భేటీ అవనున్నారని సమాచారం. తద్వారా, కాపు సామాజిక వర్గానికి స్పష్టమైన సందేశం పంపాలన్నది వైఎస్ జగన్ ఉద్దేశ్యమట.