ప్రత్యేక హోదా కంటే, రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయించడం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అంత ముఖ్యమా.? అన్న ప్రశ్న వైసీపీ వర్గాల్లోనే మొదలైంది. దానికి కారణం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, నిన్న లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి, రఘురామపై అనర్హత వేటు వేయాలని కోరడం, వేటు వేయడం ఆలస్యమైతే పార్లమెంటుని స్తంభింపజేస్తామంటూ స్పష్టం చేయడమే.
నిజానికి, పార్లమెంటుని వైసీపీ స్తంభింపజేయాలనుకుంటే, రఘురామ వ్యవహారం కంటే, బలమైన అంశాలు ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి సంబంధించి చాలా చాలా వున్నాయి. విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ, మూడు రాజధానుల అంశం, శాసన మండలి రద్దు, దిశ చట్టం.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దదే వుంది. వీటన్నిటికీ మించి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, కడప స్టీలు ప్లాంటు, పోలవరం ప్రాజెక్టు.. వంటి అంశాలు వుండనే వున్నాయి.
ఇంతేనా, తెలగు రాష్ట్రాల మధ్య జల జగడం కూడా చిన్న విషయమేమీ కాదు. ఇవన్నీ కాదని, రఘురామ అంశాన్ని పట్టుకుని పార్లమెంటుని స్తంభింపజేస్తామని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా మారిపోయింది.
రఘురామ, వైసీపీకి కొరకరాని కొయ్యిలా తయారైనమాట వాస్తవం. కానీ, ఆయన అనర్హత మీద మరీ అంతగా వైసీపీ ఉద్యమించాల్సిన అవసరం లేదు. దాని వల్ల రాష్ట్రానికిగానీ, వైసీపీకిగానీ అదనంగా కలిగే ప్రయోజనమేమీ లేదు. పైగా, రఘురామ అంశాన్ని హైలైట్ చేయడమంటే, రాష్ట్రంలో అధికార వైసీపీకి, రాష్ట్ర ప్రయోజనాల కంటే, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నభావన జనంలోకి వెళుతుంది.
రాష్ట్రంలో పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఓ జనసేన ఎమ్మెల్యే.. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన విషయం విదితమే. వారిపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ చేత అనర్హత వేటు వేయించగలిగితే, ఆ తర్వాత రఘురామ విషయంలో గట్టిగా మాట్లాడటానికి వైసీపీకి అర్హత వుంటుంది.