ఇది రెండు పార్టీలకు సంబంధించిన వ్యవహారం కాదు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారం. అవును, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ళ పంచాయితీ షురూ అవుతోంది. వాస్తవానికి, ఈ వివాదాలతో ప్రజలకేమీ సంబంధం వుండదు. నీటి సమస్యలొస్తే నష్టపోయేది ప్రజలే అయినా.. ఆ ప్రజలు ప్రాంతాల వారీగా, రాష్ట్రాల వారీగా విడిపోయి కొట్లాడుకునే పరిస్థితి వుండదు. రాజకీయ పార్టీలు లేదా నాయకులు.. ప్రజల్ని రెచ్చగొట్టి ముందుకు ఎగదోస్తుంటారు.
ఇక, తెలంగాణ రాష్ట్ర సమితి, ఆంధ్రపదేశ్ రాష్ట్రం నిర్మిస్తోన్న కొన్ని ప్రాజెక్టులపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కోర్టులను ఆశ్రయించడం ద్వారా సమస్యకు పరిష్కారం వెతికితే అదో లెక్క. కానీ, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు.. దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. అదే అసలు సమస్య. మామూలుగా అయితే, వైసీపీ.. అంతకన్నా ఘాటుగా విమర్శలు చేయగలదు. లోకేష్ విషయంలో చంద్రబాబు విషయంలో వైసీపీ విమర్శల దాడి ఎంత తీవ్రంగా వుంటుందో, ఎంత జుగుప్సాకరంగా వుంటుందో అందరికీ తెలిసిందే.
కానీ, తెలంగాణ రాష్ట్ర సమితి విషయంలో వైసీపీ సేఫ్ గేమ్ ఆడుతోంది. ఇందులో ఇంకో మాటకు తావే లేదు. అయితే, అది ఆంద్రపదేశ్ రాష్ట్రానికి నష్టం చేసే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే, తెలంగాణలో పనులు వేగంగా జరిగిపోతాయ్. అందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిదర్శనం. ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో అంత స్పీడ్ వుండదు. అందుకు నిదర్శనం పోలవరం ప్రాజెక్ట్. తిట్టేది తెలంగాణ రాష్ట్ర నాయకులు.. సంయమనం పాటించేది ఏపీ పాలకులు.. అంతిమంగా నష్టపోయేది ఆంధ్రపదేశ్ ప్రజలు. ఈ ఈక్వేషన్ అస్సలేమాత్రం సమర్థనీయం కాదు.