వైసీపీ ప్రత్యేక హోదాపై బీజేపీని ఎందుకు ప్రశ్నించట్లేదు.?

YSRCP On Silent Mode Regarding Special Status

YSRCP On Silent Mode Regarding Special Status

తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా ప్రత్యేక హోదా అంశం చర్చనీయాంశమవ్వాల్సి వుంటుంది. ఈ విషయంలో అవసరమైతే వైసీపీ, టీడీపీ సహా జనసేన కూడా ఒక్కతాటిపైకొచ్చి, భారతీయ జనతా పార్టీని నిలదీయాల్సి వుంది. ప్రత్యేక హోదా విషయంలోనే కాదు, విశాఖ ఉక్కు సహా రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై ఉమ్మడి రాజకీయ శత్రువుగా బీజేపీని, రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు చూడాల్సి వుంది. అయితే, తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా టీడీపీ టార్గెట్ వైసీపీ, వైసీపీ టార్గెట్ టీడీపీ అన్నట్టు తయారైంది పరిస్థితి. దాంతో, భారతీయ జనతా పార్టీకి ప్రత్యేక హోదా సెగ తగలడంలేదు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ తాలూకు సెగ కూడా తగలడంలేదు.

రాజధాని అలాగే పోలవరం ప్రాజెక్టు సెగ కూడా బీజేపీకి తగలకుండా రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు చాలా జాగ్రత్తపడుతున్నాయని అర్థం చేసుకోవాలేమో. జనసేన అంటే బీజేపీకి మిత్రపక్షం గనుక.. ఆ పార్టీ ఎలాగూ బీజేపీని ప్రశ్నించదు. మరి, వైసీపీ – టీడీపీ ఎందుకు ఈ విషయంలో మీనమేషాల్లెక్కడుతున్నట్లు.? ‘మాకు బీజేపీ అంటే భయం లేదు..’ అని వైసీపీ మంత్రి ఒకరు ఈ రోజు గట్టిగా చెబుతూ, చంద్రబాబు మీద తిట్ల దండకం అందుకున్నారు. సరే, రాజకీయ పార్టీలన్నాక విమర్శలు మామూలే కావొచ్చు. కానీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే చేతులు కలపాలి కదా.? విశాఖ ఉక్కు విషయమై అఖిలపక్షం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో ప్రకటించిన విషయం విదితమే. తిరుపతి ఉప ఎన్నికతో టీడీపీకి కలిగే అదనపు లాభం లేదు.. వైసీపీకి అదనపు నష్టమూ వుండదు. ఈ రెండు పార్టీలూ కొట్టుకుని బీజేపీ లాభపడితే.? రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. దేన్నీ తేలిగ్గా తీసుకోవడానికి లేదు మరి.