వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు ఈరోజు కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా కరోనాతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు. చికిత్స మధ్యలో తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయన మరణించినట్టు తెలుస్తోంది. ఆయన మరణంతో వైసీపీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతిలో వ్యక్తం చేస్తున్నాయి. బల్లి దుర్గాప్రసాద్ చాలా చిన్న వయసులోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. 28 ఏళ్ల వయసుకే ఆయన ఎమ్మెల్యే అయ్యారు.
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జన్మించిన ఆయన గూడూరు నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా ఎన్నికయ్యారు. చంద్రబాబు హయాంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన ఆయన 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. మొదటిసారి ఎన్నికైన నాటి నుండి మంచి నేతగా పేరుపొందిన ఆయనకు రావడంతోనే తిరుపతి నుండి ఎంపీగా పోటీచేసే అవకాశం కల్పించారు. ఆ ఎన్నికల్లో ఆయన 2లక్షల 28 వేల పైచిలుకు మెజారిటీతో గెలుపొంది అందరి దృష్టినీ ఆకర్షించారు. అంత మంచి నేతను కొల్పోవడం నిజంగా వైసీపీకి తీరని లోటే అనాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దుర్గాప్రసాద్ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.