వైఎస్ జగన్ సీఎం పీఠంలో కూర్చున్న రోజు నుండి ఈరోజు వరకు ఒకే లక్ష్యం పెట్టుకుని ముందుకువెళుతున్నారు. అదే సంక్షేమం. గతంలో ఏ ప్రభుత్వమూ వేయని రీతిలో జగన్ సర్కార్ సంక్షేమానికి పెద్ద పీట వేసింది. ప్రచారంలో చెప్పిన ఒక్కో పథకాన్ని అమలుచేసుకుంటూ వస్తున్నారు. అమ్మ ఒడి మొదలుకుని తాజాగా అమలుచేసిన జగనన్న విద్యాకానుక అమలు వరకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటి వరకు అనేక సంక్షేమ పథకాల కింద దగ్గర దగ్గర 50 వేల కోట్లు ఖర్చు చేశారు. రాష్ట్రానికి ఆదాయ మార్గాలు లేకపోయినా, రెవెన్యూ లోటు భారీగా ఉన్నా, పాత ప్పులు కుప్పలుగా పేరుకుని ఉన్నా కొత్త అప్పులు చేసి మరీ సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారు.
ఈ అప్పుల భారం అటు తిరిగి ఇటు తిరిగి జనం నెత్తినే పడుతుంది. కానీ వరుస సంక్షేమ పథకాలతో నిత్యం నగదు బదిలీ ద్వారా ప్రభుత్వం నుండి లబ్దిని అందుకుంటున్న అనేక వర్గాల ప్రజలకు భవిష్యత్తులో మీద పడబోయే అప్పుల భారం కనిపించట్లేదు. ప్రస్తుతానికైతే మేలు జరుగుతోంది కదా అనుకుంటూ జగన్ పాలనకు జేజేలు కొడుతున్నారు. ఇలా జనం జగన్ పాలనను జనరంజకం అంటుంటే వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం వణికిపోతున్నారు. అదేమిటి జగన్ కు మంచిపేరు వస్తే ఆయన ఎమ్మెల్యేలకు కూడా వచ్చినట్టే కదా… మరి వణుకుడేందుకు అనుకుంటున్నారా. కారణం ఉంది. అదే అభివృద్ధి లేకపోవడం.
వాళ్ళు అన్నీ గమనిస్తున్నారు :
అవును.. కొన్ని వర్గాల ప్రజలు సంక్షేమ ఫలాలను పుష్కలంగా అందుకుంటూ జగనన్నకు జైకొడుతుంటే ఇంకొన్ని వర్గాలవారు మాత్రం అభివృద్ధి ఎక్కడ అంటూ భూతద్దం పట్టుకుని వెతుకుతున్నారు. ఈ ఏడాదిన్నరలో జగన్ సర్కార్ సంక్షేమం మీద తప్ప అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదు. నియోజకవర్గాల్లో చెప్పుకోదగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవీ నిర్వహించలేదు. కనీసం శ్రీకారం చుట్టి శిలాఫలకాలు కూడ వేయలేదు. పారిశ్రామికంగా ఎలాంటి పురోగతీ లేదు. దీంతో కొన్ని వర్గాల జనం నివురుగప్పిన నిప్పుల్లా తయారవుతున్నారు. వీరంతా అచ్చంగా అభివృద్దిని చూసే ఓట్లేసే రకం. అందుకే గత ఎన్నికల్లో చంద్రబాబును కోలుకోలేని దెబ్బ కొట్టారు.
ఏం చూపించి ఓట్లు అడుగుతాం :
ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల భయం కూడా అదే. ఇప్పటికే అభివృద్ధి ఎక్కడ, ఏం చేశారు, కొత్త మౌలిక సదుపాయాలేవి అంటూ ఎమ్మెల్యేల మీద ఒత్తిడి మొదలైంది. తమ భాధ చెప్పుకుందామంటే జగన్ చేతికి కూడ చిక్కడంలేదు. ఇప్పటికిప్పుడు అసహనంగా ఉన్న వర్గాలవారిని తృప్తిపరిచేలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే తక్కువ లేకుండా ఒక్కో నియోజకవర్గానికి 15 నుండి 20 కోట్లు కావాలి. ఆ డబ్బు జగన్ వద్ద నుండే రావాలి. కానీ జగన్ పట్టించుకోవట్లేదే. ఇదే పరిస్థితి ఇంకో ఏడాది గడిస్తే వచ్చే ఎన్నికల్లో గెలవడం అటుంచితే ఓట్లు అడగడానికి కూడ మొహం చెల్లదని, అసలు ఏం చూపించి ఓట్లు అడగాలని వైసీపీ ఎమ్మెల్యేలు భయపడుతున్నారట. మరి ఇప్పటికైనా సీఎం వారి బాధను పట్టించుకుని అభివృద్ధి మీద దృష్టి పెడతారో లేదో చూడాలి.