రోజా.. వైసీపీ ఫైర్ బ్రాండ్. ఆమె మాట్లాడితే ఇక వేరే వాళ్లు నోరు మెదిపరు. తనదైన పంచ్ డైలాగులతో ఎదుటివారిపై ఇట్టే విమర్శలు చేయగల సత్తా ఉన్న రాజకీయ నాయకురాలు రోజా. అందుకే వైసీపీలో ఆమెను ఫైర్ బ్రాండ్ అంటారు. ఆమె మైకు ముందు నిలబడింది అంటే.. ఎదుటివారు ఎంతటివారైనా సరే.. తన మాటల తూటాలకు బలవ్వాల్సిందే.
తాజాగా ఆమె టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయ్యారు. అమరావతి కుంభకోణానికి సంబంధించి ఏసీబీ కేసు నమోదు అయితే చంద్రబాబు ఎందుకు గజగజా వణికిపోతున్నారంటూ రోజా ప్రశ్నించారు. ఆయన బినామీలకు ఎందుకు వణుకు పుడుతోందంటూ రోజా మండిపడ్డారు.
ఏ తప్పు చేయని వాళ్లకు భయమెందుకు? రాజధాని పేరుతో చంద్రబాబు, ఆయన బినామీలు వేల ఎకరాలను కొన్నారు. అదో పెద్ద కుంభకోణం. టీడీపీ అధికారంలోకి వచ్చి చేసిందదే. చంద్రబాబు ముఖ్యమంత్రి పనిచేసిన సమయంలో పనిచేసిన ఓ లాయర్ పై కేసు నమోదు చేస్తే హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని రోజా ప్రశ్నించారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా హైకోర్టు ఆదేశాలపై చర్చ నడుస్తోంది. ఈ విషయంలో ఎందుకు చంద్రబాబు స్పందించడం లేదు. చంద్రబాబు ఎందుకు అమరావతి భూకుంభకోణంపై సీబీఐ విచారణ కోరడం లేదు. ఫైబర్ గ్రిడ్ అక్రమాలపై ఎందుకు సీబీఐ విచారణ కోరడం లేదంటూ రోజా విరుచుకుపడ్డారు.
ప్రభుత్వం తప్పు ఏమాత్రం లేకున్నా… సీఎం జగన్.. అంతర్వేది ఘటనలో సీబీఐ విచారణ కోరారు. చంద్రబాబుకు అలా సీబీఐ విచారణను కోరే దమ్ముందా? అంటూ రోజా ప్రశ్నించారు.