వైసీపీ నేతలు కొందరు అలివికాని దూకుడు ప్రదర్శిస్తున్నారు. వారి దూకుడును చూసిన జనం సైతం ఆశ్చర్యపోతున్నారు. గత కొన్ని నెలలుగా వైసీపీ నేతలు చాలామంది కోర్టుల విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఓకే నిర్ణయం తీసుకుంటే దాన్ని సవాల్ చేస్తూ ప్రతిపక్షం లేదా విడి వ్యక్తులు ఎవరో ఒకరు కోర్టుల్లో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేస్తున్నారు. ఆ పిటిషన్లను స్వీకరించిన కోర్టు ప్రభుత్వ నిర్ణయాలు మీద స్టేలు ఇస్తూ పోతోంది. ఇప్పటివరకు ఇలా స్టేల కారణంగా ప్రభుత్వం చేయాలనుకున్న పనులు చాలా నిలిచిపోయాయి. వాటిలో పేదలకు భూముల పంపకం, రాజధాని తరలింపు, ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు, స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదంలో డాక్టర్ రమేష్ మీద విచారణ లాంటి కీలకమైన అంశాలున్నాయి.
ఈ వరుస పరిణామాలతో వైసీపీ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. చంద్రబాబు కోర్టుల ద్వారా ప్రభుత్వ పాలనకు అడ్డుపడుతున్నారని, ఆయన కోర్టులను మేనేజ్ చేస్తున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ న్యాయవ్యవస్థ మీద అనుచిత వాఖ్యలు చేశారు కూడ. దీంతో న్యాయస్థానం కొందరు నేతలకు నోటీసులు కూడ ఇచ్చింది. అయినా పాలక పక్షం విమర్శలు ఆపలేదు. పార్లమెంట్ సమావేశాల్లో కూడ న్యాయవ్యవస్థ తీరు సరిగా లేదని నేతలు ఆగ్రహించడం సంచలనం సృష్టిచింది. ఇవి చాలవన్నట్టు తాజాగా కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య గల కనకదుర్గ వారధి మీద ఏర్పాటైన ఫ్లెక్సీలు మరోసారి వివాదానికి దారితీశాయి.
ఈ ఫ్లెక్సీలు ఎమ్మెల్యే జోగి రమేష్ పేరుతో ఉండటం గమనార్హం. ఆ ఫ్లెక్సీల్లో ‘రాజ్యాంగ వ్యవస్థ పేరుతో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి సంకెళ్లు వేస్తే చూస్తూ ఊరుకోము. ప్రజల అభిమానాన్ని పొందిన ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మీకెవరిచ్చారు’ అంటూ హెచ్చరిక రాతలున్నాయి. వాటిని చూసిన జనం ఈ హెచ్చరికలు ఎవరిని ఉద్దేశించి చేసినట్టు అనుకుంటున్నారు. కొందరేమో ఇది ప్రతిపక్షానికి కౌంటర్ అంటుంటే, ఇంకొందరు మాత్రం అంటే వైసీపీ నేతలు చంద్రబాబు రాజ్యాంగ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారనే అభిప్రాయంతోనే ఉన్నారా అనుకుంటున్నారు.