అధికార పార్టీలో అంతర్గత విభేదాలు గట్టిగానే నడుస్తున్నాయి. ఇతర విషయాల కారణంగా అవి బయటకు రావడంలేదు కానీ కొన్ని నియోజకవర్గాల్లో అవి తారాస్థాయిలో ఉన్నాయట. ముఖ్యంగా ఎంపీ స్థాయి నేతలు కేంద్రంగా ఈ గొడవలు ఉండటం గమనార్హం. ఇప్పటివరకు నరసాపురం ఎంపీ రఘురామరాజే వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అనుకుంటే ఆ జాబితాలోకి మరొక ఎంపీ చేరారు. ఆయనే నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. మొదటిసారి ఎన్నికల్లో గెలిచి పదవి పొందిన ఆయన తొలి నుంచీ దూకుడుగానే ఉన్నారు. అనుకున్నది చేయడం, తన పరిధిలోని ఎమ్మెల్యేలతో మాట మంతీ సరిగా నడపకపోవడంతో ఆయన మీద ఎమ్మెల్యేలు సీరియస్ అవుతున్నారు.
ఇప్పటికే చికలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీతో కృష్ణదేవరాయలకు అనేకసార్లు బహిరంగంగానే గొడవలు జరిగాయి. తనకు చెప్పకుండా తన నియోజకవర్గానికి వస్తారా అంటూ రజనీ ఎంపీ మీద గుస్సా అయ్యారు. ఆమె తరహాలోనే ఇంకో ఎమ్మెల్యేకు కూడా కృష్ణదేవరాయలు అంటే అస్సలు పడని పరిస్థితి. అతనే నరసారావుపేట ఎమ్మెల్యే గొపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. నియోజకవర్గంలోని అభివృద్ది పనులకు ఎంపీ నుండి సహకారం అండదంలేదని గోపిరెడ్డి కోపంగా ఉన్నారట. అంతేకాదు ఎంపీ కొన్ని సామాజికవర్గాలని పనిగట్టుకుని చేరదీయడం కూడా ఎమ్మెల్యేకు నచ్చలేదు.
అందుకే ఆయన తిరగబడి ఎంపీకి తగిలేలా వేరే సామాజికవర్గాలను ప్రోత్సహిస్తున్నారట. ఈ భిన్న సామాజికవర్గ సమీకరణాలతో ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరూ ఉప్పు నిప్పులా తయారయ్యారట. ఈ వివాదం పార్టీ పెద్దల వరకు చేరిందట. సదరు ఎంపీ మీద అసహనంగా ఉన్న ఇతర ఎమ్మెల్యేలు కూడా హైకమాండ్ వద్ద మొరపెట్టుకున్నారట. అయినా ఎంపీ ఎక్కడా తగ్గడకుండా తన దారేదో తనదే అన్నట్టు వెళుతున్నారట. మరి రోజురోజుకీ గాలివానలా మారుతున్న ఈ వివాదాన్ని హైకమాండ్ పెద్దలు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.