వైసీపీ మంత్రుల బస్సు యాత్ర.. ‘రాంగ్’ టైమింగ్.!

YSRCP Ministers

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా వైసీపీ మంత్రుల సామాజిక న్యాయ భేరీ బస్సు యాత్రది రాంగ్ టైమింగ్. వైసీపీ అనుకూల మీడియా తప్ప, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరూ మంత్రుల బస్సు యాత్ర గురించి మాట్లాడుకోవడంలేదు. ఆయా ప్రాంతాల్లో వైసీపీ నేతలే కాదు, తెరవెనుకాల అధికారులు కూడా టార్గెట్లు పెట్టిమరీ, జనాన్ని మంత్రుల బస్సు యాత్రకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నా అది వర్కవుట్ కావడంలేదు.

చివరికి కొందరు మంత్రులే విసిగిపోయారు. దాంతో, ఇంకాస్త ప్రతిష్టాత్మకంగా ఈ యాత్రను తీసుకున్న వైసీపీ అధిష్టానం, మరింత కష్టపడి.. జన సమీకరణను చేపట్టడంతో.. మంత్రుల్లో కాస్త ఉత్సాహం కనిపించింది. ఓ వైపు మహానాడు, ఇంకో వైపు వైసీపీ మంత్రుల బస్సు యాత్ర.. వెరసి, ఒకింత హంగామా కనిపించింది. అయితే, మంత్రుల బస్సు యాత్రని మెజార్టీ మీడియా లైట్ తీసుకుంది.

వాస్తవానికి, వైసీపీ కార్యకర్తలు సైతం, మంత్రుల బస్సు యాత్ర పట్ల అంత సీరియస్‌గా వ్యవహరించడంలేదు. బలవంతంగా తీసుకొస్తున్న జనం కాస్తా, మంత్రుల యాత్ర నడుస్తుండగానే తిరుగుముఖం పడుతుండడంతో.. వారిని వారించేందుకు అధికార పార్టీ నేతలు పడరాని పాట్లూ పడాల్సి వస్తోంది.

మొత్తంగా మంత్రుల బస్సు యాత్ర తాలూకు ఖర్చు తడిసి మోపెడైపోతోందని స్థానిక నాయకత్వం వాపోతోందట. మహానాడు తర్వాత మంత్రుల బస్సు యాత్ర వుండి వుంటే ఖచ్చితంగా సక్సెస్ అయ్యేదన్న అభిప్రాయం వైసీపీలో వ్యక్తమవుతోంది.

ఇదిలా వుంటే, సామాజిక న్యాయ భేరీ యాత్రతో సంబంధం లేకుండా వున్న మంత్రులు, తమకు పబ్లిసిటీ రావడంలేదంటూ అధిష్టానంపై కినుక వహించారన్నది తాజా ఖబర్.