వైసీపీ మంత్రుల న్యాయభేరి బస్సు యాత్ర.! ఖర్చు దండగ వ్యవహారమే.!

రోమ్ తగలబడిపోతోంటే, నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించాడో లేదోగానీ.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్ర విచిత్రమైన పరిస్థితులు నెలకొన్న వేళ, మంత్రులు సామాజిక న్యాయ భేరీ.. పేరుతో బస్సు యాత్ర షురూ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రులంతా కలిసి ఈ బస్సు యాత్రలో పాల్గొంటున్నారు. మొత్తం 17 మంది మంత్రులు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఈ బస్సు యాత్రలో సందడి చేస్తారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు పెద్ద పీట వేశామనీ, మంత్రి పదవులు ఇవ్వడమే కాకుండా, చట్ట సభలకు పంపే అభ్యర్థుల విషయంలోనూ సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నామనీ మంత్రులు చెబుతున్నారు. మంచిదే, చేసిన పనులు చెప్పుకోవడంలో ఎలాంటి తప్పూ లేదు. కాకపోతే, ఇదా సమయం.? అన్నదే అసలు ప్రశ్న.

కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేశారు.. అందులో కోనసీమ జిల్లా కూడా ఒకటి. ఆ జిల్లా పేరు మార్పు విషయమై వివాదం నడుస్తోంది. ఆ వివాదానికి సంబంధించి నెపాన్ని విపక్షాల మీదకు నెట్టేస్తోంది అధికార పక్షం. ఇంత గలాటా జరుగుతోంటే, ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి, బాధ్యతారాహిత్యంతో నెపాన్ని ఇతరుల మీద నెట్టేయడమేంటి.?

రాజ్యసభకు నలుగుర్ని పంపే అవకాశం వైసీపీకి తాజాగా వచ్చింది. ఇద్దరు బీసీలు, ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారికి వైసీపీ అధిష్టానం రాజ్యసభ అభ్యర్థులుగా అవకాశమిచ్చింది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఊసెందుకు లేదు.? అన్న ప్రశ్నకు వైసీపీ దగ్గర సమాధానమే లేదు.

అసలు మంత్రులు చేపడుతున్న సామాజిక న్యాయ భేరి యాత్ర తాలూకు అంతరార్థమేంటో అధికార పార్టీకి అయినా తెలుసా.? లేదా.? అన్న అనుమానం చాలామందికి కలుగుతోంది. నాలుగు రోజుల్లో రాష్ట్రమంతా పర్యటించేసి, తద్వారా మంత్రులు ప్రజలకు ఏం సంకేతాలు ఇవ్వదలచుకున్నట్టు.?