టీడీపీ ఎమ్మెల్యేలు అనుకున్నదే తడవుగా పార్టీ మారిపోతున్నారు. చంద్రబాబుకు గుడ్ బై చెప్పి జగన్ భజన చేస్తున్నారు. కష్టమో, నష్టమో వారి విషయంలో ఒక క్లారిటీ ఉంది. కానీ గంటా శ్రీనివాసరావు విషయంలోనే స్పష్టత లేదు. అన్ని అడ్డంకులను దాటుకుని వైసీపీలోకి మార్గం సుగమం చేసుకున్న ఆయన పార్టీ మాత్రం మారట్లేదు. ఇందుకు కారణం గంటా పెడుతున్న కండీషననే అంటున్నారు చాలామంది. తాను ఆందరిలా అనధికారికంగా పార్టీ మారానని అధికారికంగానే పార్టీలోకి వస్తానని అంటున్నారట. అందుకోసం అవసరమైతే ఉప ఎన్నికల్లోకి కూడ వెళ్లి గెలిచి వస్తానని చెబుతున్నారట. ఇది సమంజసమైన షరతే అయినా ఇంకో పెద్ద కండీషన్ ఉందట.
అదేమిటంటే తనకు గెలిచి రావడంతోనే మంత్రి పదవి కట్టబెట్టాలనేది ఆయన డిమాండ్ అట. అవును.. ఆయన టీడీపీని వీడాలని అనుకుంటున్నది పదవి ఉన్న ఓవర్ లేదనే. ఏదో ఒక మంత్రి పదవి ఉంటేనే తప్ప ఆయనకు మనసు ప్రశాంతంగా ఉండదు. అందుకే జగన్ ముందు మినిస్ట్రీ డిమాండ్ ఉంచారట. ఇవే డిమాండ్లను వేరొక ఎమ్మెల్యే ఎవరైన చేసుంటే జగన్ ఎప్పుడో బయల్దేరమనేవారే. కానీ అక్కడున్నది గంటా. విశాఖలో తిరుగులేని నేత. ఈ పార్టీ తరపున నిలబడిన గెలుచుకురాగలరు. అందుకే ఆయన మీద అంత ఆసక్తి. దాన్నే అదునుగా తీసుకున్న గంటా మంత్రి పదవి డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికే జగన్ కేబినెట్లో అన్ని మంత్రి పదవులు భర్తీ అయిపోయాయి. రెండున్నరేళ్ల తర్వాత ఏవైనా మార్పులు జరిగితే తమకు అవకాశం దక్కుతుందేమోనని చాలామంది కీలక నేతలు కాచుకుని ఉన్నారు. అవకాశాలు ఇస్తే గిస్తే వారికే ఇవ్వాలి. కానీ గంటా మాత్రం పట్టువీడటంలేదు. ఆయన పంతం మూలాన కేబినెట్లో ఉన్న ఒక మంత్రికి పదవీ గండం పొంచి ఉందని చెప్పుకుంటున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన ఆ నేతను పక్కనపెట్టి జగన్ గంటాకు అవకాశం కల్పిస్తారనే టాక్ నడుస్తోంది. అందుకే ఆయన గంటా చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. మరి ఆ మంత్రి ఎవరు, ఏమా సంగతి తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.