ఏపీ ప్రభుత్వంపై జనసేన అధ్యక్షుడ పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. పార్టీ తరుపున ప్రకటన విడుదల చేశారు. ప్రజా గళం వినిపిస్తూ.. బాధితులకు అండగా ఉంటున్న జనసేన శ్రేణులపై అధికార పక్షం దాడులకు తెగబడుతున్నా… రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని.. ఇది నిజంగా అప్రజాస్వామికం అంటూ పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు.
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం నిడిగట్టు సమీపంలోని నేరెళ్ల వలస అనే గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త మూగి ప్రసాద్, బీజేపీ కార్యకర్త మూగి శ్రీనివాస్ పై వైఎస్సార్సీపీ నాయకుడు చిన్నా హత్యాయత్నం చేశాడంటూ పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
దీంతో బాధితులకు తీవ్ర గాయాలయ్యాయని… వాళ్లు ప్రస్తుతం కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్.. భీమిలి పోలీసులపై మండిపడ్డారు.
బీజేపీ, జనసేన నాయకులపై హత్యాయత్నం చేసిన వైసీపీ నేతను అరెస్ట్ చేయకుండా బాధితుల పక్షాన నిలిచిన వాళ్లను అరెస్ట్ చేయడం ఏంటి? అంటూ పవన్ ప్రశ్నించారు.
ఓ వివాహితపై చిన్నా అనే వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడితే.. మందలించినందుకు ప్రసాద్, శ్రీనివాస్ అనే వ్యక్తులపై చిన్నా కత్తితో దాడికి తెగబడ్డాడంటూ జనసేన నాయకులు తెలిపారన్నారు.
వాలంటీర్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన చిన్నాపై నిర్భయ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని పవన్ డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టం ఎక్కడ పోయింది? పోలీసులు అధికార పక్షం మాట విని.. అసలు హంతకులను అరెస్ట్ చేయకుండా… బాధితులకు అండగా ఉన్నవాళ్లను, అమాయకులను అరెస్ట్ చేశారు. ఇదేనా ప్రజాస్వామ్యం. దీనిపై రాష్ట్ర డీజీపీ వెంటనే స్పందించాలి. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి హత్యాయత్నం కేసు నమోదు చేయాలి.. అంటూ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
కొన్ని రోజుల క్రితం విజయనగరంలోనూ బీజేపీ నేతపై అధికార పక్ష గుండాలు హత్యాయత్నం చేశారని.. తాజాగా భీమిలిలో జనసేన, బీజేపీ నేతలపై వైసీపీ నేత హత్యాయత్నం చేయడం రాష్ట్రంలో రాజ్యేమేలుతున్న గుండాయిజానికి నిదర్శనమని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.
పవన్ కళ్యాణ్ రిలీజ్ చేసిన ఈ ప్రకటనపై వైసీపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. అయితే.. బీజేపీ నాయకులపై జరుగుతున్న దాడులపై కూడా పవన్ కళ్యాణే ప్రశ్నిస్తుండటం.. బీజేపీ నేతలు మాత్రం స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.