వైసీపీ ప్రజా ప్రతినిథులకు నీలి మీడియా ముప్పు.!

అప్పట్లో పచ్చ మీడియా.. ఇప్పుడేమో నీలి మీడియా.! చేసే వ్యవహారం ఒకటే. కాకపోతే, పార్టీలు మారాయ్.. మీడియా రంగులూ మారాయ్. అంతే తేడా.!
అసలు విషయమేంటంటే, వైసీపీ ప్రజా ప్రతినిథులకు వైసీపీ అనుకూల మీడియా నుంచే తలనొప్పులు ఎదురవుతున్నాయి. ‘మీకు ఈసారి టిక్కెట్టు లేదట. ప్రత్యమ్నాయం చూసుకోండి..’ అంటూ వైసీపీ కీలక నేతలకు బులుగు మీడియా పొగ పెడుతోంది. దాంతో పలువురు వైసీపీ కీలక నేతలు, అందునా ప్రజా ప్రతినిథులు ఏం చేయాలో పాలుపోక గింజుకోవాల్సి వస్తోంది.

జరుగుతున్న దారుణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహణ్ రెడ్డికి చెప్పుకోలేకపోతున్నారట చాలామంది ప్రజా ప్రతినిథులు. ఆ మధ్య ఉమ్మడి కడప జిల్లాకి చెందిన ఓ వైసీపీ ఎమ్మెల్యేపై నీలి మీడియా కన్నేసింది. ఆయనకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకూడదని వైసీపీ నిర్ణయించుకున్నట్లుగా నీలి మీడియాలో వార్తలొచ్చాయ్. దాంతో అప్పటిదాకా చాలా యాక్టివ్‌గా వైసీపీ కార్యకలాపాల్లో పాల్గొన్న ఆయన అనూహ్యంగా సైలెంటయిపోయారు.

తాజాగా, ఓ ఎంపీ మీద కూడా ఇదే తరహా ప్రచారం నీలి మీడియా షురూ చేసింది. ఆయనా తన సన్నిహితుల వద్ద జరుగుతున్న దుష్ప్రచారంపై గుస్సా అయ్యారు. అధినేత దృష్టికి తీసుకెళ్ళొచ్చు కదా.? అని సదరు ఎంపీని ఆయన సన్నిహితులు అడిగితే, ‘జరుగుతున్న దుష్ప్రచారం ముఖ్యమంత్రికి తెలియదా.?’ అని ఆయన ఎదురు ప్రశ్నించారట.

చంద్రబాబు హయాంలో కూడా ఇలాగే జరిగేది. దాంతో, టిక్కెట్లు దక్కిన నేతలు కూడా చివరి నిమిషంలో.. అంటే, 2019 ఎన్నికల సమయంలో వేరే పార్టీల్లోకి.. అందునా వైసీపీలోకి దూకేశారు. అదే పరిస్థితి వైసీపీకి వస్తే.?