భగ్గుమంటున్న నిరుద్యోగ యువత: డ్యామేజ్ కంట్రోల్ ఎలా.?

YSRCP Govt's Job Callender, A Failed One?

YSRCP Govt's Job Callender, A Failed One?

‘జాబ్ క్యాలెండర్ విడుదల చేసి మమ్మల్ని అవమానించారు..’ అంటూ ఓ నిరుద్యోగ యువకుడు, వైసీపీ అనుకూల మీడియాకి చెందిన ఓ న్యూస్ ఛానల్ చర్చా కార్యక్రమంలో ఫోన్ ఇన్ ద్వారా తన ఆవేదన వెల్లగక్కిన వైనం, అధికార పార్టీలో ఖచ్చితంగా ఆందోళన కలిగిస్తుంది. ‘జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోయినా, మాకు కాస్త గౌరవంగా వుండేదేమో.. ‘ ఆ నిరుద్యోగి వ్యక్తం చేసిన ఆవేదనలో వాస్తవం వుంది. పోలీసు శాఖలో అతి తక్కువ పోస్టులు పేర్కొనడమే ఆ నిరుద్యోగ యువకుడి ఆవేదనకు కారణం. నిజానికి, ప్రభుత్వ ఉద్యోగాల్లో కోత.. అన్నది సర్వసాధారణమైపోయింది.

కాలం మారింది.. ప్రభుత్వ ఖజానాకి ఉద్యోగులు భారంగా మారుతున్నారన్న విమర్శ ఈనాటిది కాదు. అందుకే, కాంట్రాక్టు వర్కర్ల వ్యవహారం తెరపైకొచ్చింది. సరే, ఏ ప్రభుత్వం ఏం చేసిందన్నది వేరే చర్చ. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా చాలా హామీలు గుప్పించారు. అందులో జాబ్ క్యాలెండర్ ఒకటి. ఆయా విభాగాల్లో పెద్దయెత్తున ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.. కానీ, ఆ స్థాయిలో ఉద్యోగాల కల్పన చేయలేకపోయారు. దానికి కారణాలు ఏమైనా అయి వుండొచ్చుగాక. మాట తప్పను, మడమ తిప్పను.. అని చెప్పుకున్నారు కాబట్టి.. తప్పదు ఉద్యోగాలు ఇచ్చి తీరాల్సిందే.

నిరుద్యోగ యువత నేడు రోడ్డెక్కింది..జాబ్ క్యాలెండర్ దండగ.. అంటూ నినదించింది. ఇది ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలాంటిదేనని భావించాలి. విపక్షాలు యాగీ చేస్తే, ఎదురుదాడి చేసి.. విపక్షాల గొంతు నొక్కడం తేలికే. కానీ, ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడితే.. అందునా, విద్యార్థి లోకం నినదిస్తే.. పరిస్థితులు తారుమారవుతాయి. జగన్ ప్రభుత్వం ఈ విషయమై ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాల్సి వుంది.