పేదలకు కూడా కార్పొరేట్ వైద్యం అందాలని.. ఉచితంగా లక్షల విలువ చేసే వైద్యాన్ని అందించాలన్న సంకల్పంతో ప్రారంభించిన పథకమే ఆరోగ్యశ్రీ. దీని వల్ల పేదలకు ఎంతో ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా ప్రభుత్వం అందిస్తోంది. వైఎస్ఆర్ కాలంలోనే ఆ పథకం ప్రారంభమైనా.. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ఇంకా విస్తరించాలని యోచిస్తోంది. దాని కోసం ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోంది.
అయితే.. ఆరోగ్యశ్రీపై ఆంధ్రజ్యోతి పత్రికలో విషపు రాతలు రాస్తున్నారని వైసీపీ పార్టీ మండిపడుతోంది. కావాలని.. ఆరోగ్యశ్రీపై విషం చిమ్మడం దారుణమంటూ.. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీని పట్టించుకున్న నాథుడే లేడు. ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారు. పేదలకు ఆరోగ్యశ్రీ ఫలాలే అందలేదు. అప్పుడు రాధాకృష్ణ కళ్లు మూసుకున్నారా? అప్పుడు ఎందుకు ఇటువంటి విషపు రాతలు రాయలేదు. ఆంధ్రజ్యోతి ఆరోగ్యశ్రీపై అవాస్తవాలను రాస్తోందని.. రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఏపీ ప్రభుత్వం వెనుకాడబోదని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఆరోగ్యశ్రీ పరిధిని పెంచి మరింతమంది పేదలకు మరిన్ని వైద్య సౌకర్యాలను కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షలకు పెంచడంతో పాటు.. 2434 రోగాలను ఆరోగ్యశ్రీ కింద చేర్చారని.. ఇవన్నీ రాధాకృష్ణకు తెలియకపోవడం విడ్డురమన్నారు.
ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఉంది. రాధాకృష్ణ రోతరాతలపై కేసు పెట్టడానికి కూడా సిద్ధమవుతున్నట్టుగా ప్రచారంలో ఉంది. దీనిపై అధికార సమాచారం మాత్రం రాలేదు.