హన్నన్నా.. రఘురామా.. యెల్లో మీడియాతో ఇంత కుట్ర పన్నితివా.?

ఏకంగా 11 కోట్ల రూపాయల మేర లావాదేవీలు జరిగాయట వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకీ, యెల్లో మీడియాకి చెందిన ఓ ఛానల్‌కీ మధ్య. యూరోల రూపంలో ఈ లావాదేవీలు జరిగినట్లు వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది. అంతే కాదు, ఏపీ సీఐడీ కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తోంది. బ్యాంకు అకౌంట్లతో సహా, రఘురామ యెల్లో మనీ వ్యవహారంపై నిజాలు నిగ్గు తేల్చతున్నారు వైసీపీ నేతలు. ప్రధాని నరేంద్ర మోడీకి సైతం, రఘురామ యెల్లో మనీ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు వైసీపీ ఎంపీలు. కేంద్రం స్పందించి, జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థలతో ఈ వ్యవహారంపై విచారణ జరపడమే తరువాయి.. అన్నది వైసీపీ నేతలు చెబుతున్నమాట.

2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి నర్సాపురం ఎంపీగా విజయం సాధించారు రఘురామకృష్ణరాజు. మొదట్లో రఘురామ బాగానే వున్నా, ఆ తర్వాతే ఆయన వైసీపీకి దూరమవుతూ వచ్చారు. వైసీపీ మీద జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయడం కోసమే రచ్చబండ అనే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు.. అదీ యెల్లో మీడియా, యెల్లో రాజకీయం అండదండలతో. ఢిల్లీ స్థాయిలో బీజేపీ పెద్దలతో తనకున్న పరిచయాల్ని అడ్డగోలుగా వాడేసుకున్న వైనం చూసి, ఏపీ బీజేపీ నేతలు సైతం షాక్ అయ్యారంటే రఘురామ వాడకం ఎలా వుంటుందో అర్థం చేసుకోవచ్చు. చిత్రమేంటంటే, రఘురామకి ఢిల్లీ బీజేపీ పెద్దల ఆశీస్సులు బలంగానే వున్నాయి.

ఈ నేపథ్యంలో వైసీపీ ఎంత అరిచి గీ పెట్టినా రఘురామ మీద ఢిల్లీ స్థాయిలో చర్యలుంటాయన్నది అనుమానమే. ఢిల్లీ పరిచయాలు రఘురామకి అంతగా లేకపోతే, ఈపాటికి ఆయన మీద అనర్హత వేటు పడేదేనన్నది ప్రముఖంగా వినిపించే ఓ బలమైన అభిప్రాయం. ఇదిలా వుంటే, రఘురామపై ఇప్పటికే రాజద్రోహం కింద కేసులు నమోదైన విషయం విదితమే. ఈ కేసులో ఆయన అరెస్టయ్యారు కూడా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రఘురామ యెల్లో మీడియాతో కలిసి కుట్ర పన్నారన్నది ఆయన మీద వున్న ఆరోపణ. సమాజంలో అశాంతిని, విద్వేషాల్ని రగల్చడమే రఘురామ ఏకైక ఎజెండా అని వైసీపీ ఆరోపిస్తోంది. దానికి తగ్గట్టే రఘురామకు వ్యతిరేకంగా సాక్ష్యాలు, ఆధారాల్ని తీసుకొస్తోంది.